Amaravati Re Launch: ఏపీ ( Andhra Pradesh) చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయే రోజు ఇది అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అంతకుముందు మంత్రులు నారాయణ, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. వారి తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ఐదేళ్లపాటు అమరావతి పై జరిగిన విధ్వంసం, అమరావతి రైతులపై మోపిన ఉక్కు పాదం, రాష్ట్ర అభివృద్ధి కి విఘాతం కల్పించిన అంశాలను వివరిస్తూ చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పరుగులు పెడుతుందని గుర్తు చేస్తూ మాట్లాడారు చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం పాత్రను ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రసంగం కొనసాగింది.
* కుట్రలను అధిగమించి..
ఏపీ చరిత్రలోనే ఈరోజు శాశ్వతంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు( AP CM Chandrababu). ఏ రోజైతే అమరావతి పనులు నిలిచిపోయాయో.. నాటి నుంచి విధ్వంసం మొదలైంది అన్నారు. కుట్రలను ఛేదించి అమరావతి నిలబడిందన్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోడీ వచ్చారని.. ఇంతకంటే గొప్ప రోజు మరొకటి లేదని అభివర్ణించారు చంద్రబాబు. ఈసారి ప్రధాని మోదీని కలిసినప్పుడు గంభీర వాతావరణం కనిపించిందని.. దానికి కారణం ఉగ్రదాడి అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదం విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్న.. ఆయనకు మేము అండగా ఉంటాం అని ప్రకటించారు చంద్రబాబు. ఒక కుటుంబం కానీ.. పరిశ్రమ కానీ.. సంస్థ కానీ.. ఏదైనా సరే దానికి మంచి నాయకుడు ఉంటే చాలా బాగుపడుతుందని చెప్పారు. మోడీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక అభివృద్ధిలో పదో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు ఐదవ స్థానంలోకి వచ్చిందన్నారు. త్వరలో 4వ స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
* అమరావతికి ఆశీస్సులు కావాలి..
ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఆశీస్సులు అమరావతికి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఒక్క అమరావతిని మాత్రమే కాకుండా అన్ని జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకంలో ఏపీ ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పుకొచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చారని… రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని.. కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుందని.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభిస్తామని.. బిట్స్ పిలాని వంటి సంస్థలు మన రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
* అనుకున్నది నెరవేర్చుకున్న చంద్రబాబు..
అయితే చంద్రబాబు తన ప్రసంగంలో.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరిస్తూనే.. ఆయన విధానాలను తప్పకుండా మద్దతిస్తామని చెబుతూనే.. అమరావతి రాజధాని( Amravati capital) నిర్మాణానికి సాయం కోరారు. జాతీయ విధానాలు ప్రస్తావిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడినంత సేపు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కనిపించారు. మొత్తానికైతే ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించారు. జగన్ పై శపధం చేసినట్టుగానే అమరావతి రాజధాని పునర్నిర్మాణాన్ని అత్యంత వేడుకగా జరిపించారు.