Amaravati : అమరావతి పై ( Amravati capital )ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఒకవైపు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూనే.. పనులు వేగవంతం చేయాలని చూస్తోంది. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటు తరువాత నిన్ననే క్యాబినెట్ సమావేశం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా అమరావతి రాజధానిని మున్ముందు కదిలించలేని పటిష్ట స్థితిలోకి చేర్చాలని నిర్ణయించారు. పార్లమెంట్లో గెజిట్ విడుదల చేసి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమరావతి రాజధానికి అనుసంధానంగా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న ఓ నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆ పనులు చేస్తేనే సాధ్యం!
* స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు చర్యలు..
అమరావతిలో క్రీడా పరంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం( allians government ) కృతనిశ్చయంతో ఉంది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే గుర్తింపు సాధించేలా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్న త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో భూములు సేకరించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. స్పోర్ట్స్ సిటీ కోసం ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నారు. అంతకుముందు కృష్ణా నదిలో ఉన్న చిన్నలంక, పెదలంక దీవులను సైతం అధికారులు పరిశీలించారు. అవి వరదలకు మునిగిపోయే అవకాశం ఉండడంతో వాటిని వద్దనుకున్నారు. వాటికి దగ్గరలో ఉన్న ఈ నాలుగు గ్రామాలను తాజాగా ఎంపిక చేశారు.
* ఇప్పటికే రెండు క్రికెట్ మైదానాలు
మూలపాడు లో( moulapadu ) ఇప్పటికే రెండు క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచి అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అందుకే ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడు లోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. గురువారం ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్పారు. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయి. ఈ స్పోర్ట్స్ సిటీతోపాటుగా అక్కడే దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read : అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరిగేనా?
* భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధం..
ప్రస్తుతం ఈ నాలుగు గ్రామాలు ఎన్టీఆర్ జిల్లా( NTR district) పరిధిలో ఉన్నాయి. వాటిని అమరావతి పరిధిలోకి తేవాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందే ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తాము అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ నాలుగు గ్రామాల ప్రజలు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అక్కడే ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రెండు వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాలని కూడా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఎందుకుగాను అధ్యయనం కోసం ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ టీం గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించింది. మొత్తానికి అయితే ఏపీలో అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ అందుబాటులోకి రానుందన్నమాట.