Amravati Capital: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ పూర్తి చేసింది. ప్రపంచ బ్యాంక్ సైతం నిధుల విడుదలకు సంసిద్ధంగా ఉంది. మరోవైపు హడ్కో 11 వేల కోట్లు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు గతంలోనే నిధుల విడుదలకు ముందుకొచ్చింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అప్పట్లో కూడా నిధుల కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది టిడిపి ప్రభుత్వం. ఆ సమయంలో ఏపీ నుంచి అనేక అభ్యంతరాలు వెళ్లాయి. అమరావతికి కృష్ణా నది వరద ముప్పు ఉందన్నది అప్పట్లో వచ్చిన అభ్యంతరం. ఇప్పుడు తాజాగా ప్రపంచ బ్యాంకు నిధుల విడుదల సమయంలో కూడా అపరిచిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై రకరకాల అభిప్రాయాలు సాయం చేసే సంస్థలు వ్యక్తం చేయడంతో కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అమరావతికి శాశ్వతంగా వరద ముప్పు లేకుండా చూడాలని భావిస్తోంది. అందుకు ఒక కీలకమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
* గతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం
అమరావతి రాజధాని( Amravati capital ) ప్రాంతాన్ని కృష్ణా నది వరదల నుంచి రక్షించేందుకు గతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయితే దీంతో వరదలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు రుణాలు ఇస్తున్న సంస్థలు మాత్రం దీనినే అభ్యంతరంగా చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అదనంగా.. మరో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్ధమవుతోంది. కొండవీటి వాగు( kondaveeti vogu) ఎత్తిపోతల పథకం పక్కనే.. మరో లిఫ్టు ఇరిగేషన్ స్కీం నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. 7350 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ కొత్త ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ తయారు చేయబోతున్నారు.
* అప్పట్లో వైసీపీ నేతలు ఆరోపణలు
వైసీపీ( YSR Congress ) అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. కర్నూలు ను న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు. కానీ రాజధానులను మాత్రం ఏర్పాటు చేయలేకపోయారు. అయితే అప్పట్లో అమరావతిని స్మశానంతో పోల్చారు కొందరు మంత్రులు. అందుకు తగ్గట్టుగానే అక్కడ పరిస్థితులను మార్చేశారు. అయితే అప్పట్లో మెజారిటీ వైసీపీ నేతలు మాత్రం.. అమరావతికి కృష్ణా నది వరద ముంపు ఉందని.. ఈ ప్రాంతం రాజధానికి పనికి రాదని తేల్చి చెప్పారు. నదుల పక్కన రాజధాని ఎక్కడా లేదని కూడా చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము అమరావతిని అందుకే విస్మరిస్తున్నామని కూడా ప్రకటించారు.
* బిపిఆర్ కు ఆదేశం
అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో( World Bank) పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15 వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు అందిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయా సంస్థల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొండవీటి వాగు పక్కనే.. మరో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్ణయించింది. టెండర్లను కూడా ఆహ్వానించింది. ఫిబ్రవరి 14 వరకు టెండర్లు నమోదుకు అవకాశం ఉంది. గతంలో టిడిపి ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని 237 కోట్ల రూపాయలతో.. కేవలం 18 నెలల్లో పూర్తి చేసింది. ఇప్పుడు అదే స్థాయిలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానందన్నమాట