Amaravati Diesel Issue: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి సాక్షి మీడియా వరమో.. శాపమో అర్థం కావడం లేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల దృష్ట్యా సొంతంగా మీడియా ఉండాలని భావించారు. తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి కి ధీటుగా ఒక మీడియా రావాలని భావించి కుమారుడు జగన్మోహన్ రెడ్డితో సాక్షి మీడియాను ఏర్పాటు చేయించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణంతో సాక్షి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కరపత్రం గా మారిపోయింది. సాధారణంగా మీడియా అంటే ఏదో ఒక పార్టీకి మద్దతు తెలుపుతుంది. ఆ పార్టీకి అనుకూలంగా కథనాలు రాస్తుంది. కానీ సాక్షి మీడియాలో వచ్చే కథనాలు, వార్తలు మరీ ఎబ్బెట్టుగా ఉంటాయి. ముఖ్యంగా సాక్షి ఛానల్ లో వచ్చే కథనాలు విపరీతంగా ట్రోల్స్ అవుతుంటాయి. తాజాగా డీజిల్ కొరతపై ఒక వార్త విపరీతంగా ట్రోల్ అవుతోంది.
* పక్కకు వెళ్లిపోయిన వైసీపీ ఆందోళన..
ఇటీవల ఏపీలో డీజిల్( diesel) కొరత తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే అది ప్రధాన నగరాల్లోనే కనిపించింది. అది కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో వాహనదారులు ఎగబడ్డారు పెట్రోల్ బంకులపై. దీనిని ఒక రాజకీయ అస్త్రంగా చేసుకుని కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. డీజిల్ కొరతను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేసింది. అయితే సీఎం చంద్రబాబు ముందుగానే మేల్కొన్నారు. అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. డీలర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజిల్ కొరత తీరింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు పక్కకు వెళ్లిపోయాయి.
* ఎబ్బెట్టుగానే కథనం..
అయితే ఇప్పుడు సాక్షిలో ( Sakshi) ఒక కథనం మరి ఎబ్బెట్టుగా ఉంది. రాష్ట్రంలో బంకులన్నింటి నుంచి డీజిల్ ను అమరావతికి తరలిస్తున్నారు అనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే అమరావతికి వ్యతిరేక పార్టీగా వైసీపీ పై ఒక ముద్ర ఉంది. జగన్ మావిగన్ ప్రతిపాదన ప్రజల్లో మరింత చులకన చేసింది. ఇప్పుడు సాక్షిలో ఈ అడ్డగోలు కథనం చూస్తుంటే మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు. అమరావతిలో చురుగ్గా పనులు సాగడం లేదని ఇదే సాక్షి మీడియా చెబుతోంది. ఇప్పుడేమో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ తరలిస్తున్నట్లు అదే సాక్షి మీడియా కథనాలు ప్రచురిస్తోంది. తద్వారా అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. అయితే ఆది నుంచి సాక్షి మీడియాకు అదే పని. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే పత్రికలు, మీడియా ఒక పద్ధతి ప్రకారం వెళ్తాయి. సాక్షి మాత్రం అడ్డగోలుగా వెళ్తోంది. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తోంది.