Amaravati Capital: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభ విజయవంతం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సక్సెస్ అయ్యింది. ఏపీకి అండగా నిలబడతానని మోడీ హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధిలో మీతో కలిసి అడుగులు వేస్తానని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ పనితీరును మెచ్చుకున్నారు. వారిని అభినందిస్తూ మోడీ ప్రసంగించారు. టెక్నాలజీ అధ్యుడు చంద్రబాబు అని.. ఆయనను చూసి చాలా నేర్చుకున్నానని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సుమారు 58 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం ఇస్తారని అంతా ఎదురుచూశారు. అయితే ఏకంగా ఏపీకి భరోసా ఇచ్చి వెళ్లారు.
Also Read:అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలతో దక్షిణ అమెరికా అప్రమత్తం
* పవిత్ర జలాలు, మట్టికే పరిమితం
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. నాడు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే అప్పట్లో ఏదో ఒక వరం ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ పవిత్ర నదుల నుంచి తెచ్చిన జలం, మట్టి మాత్రమే ఇచ్చారు. అప్పట్లో ఇది విమర్శలకు కారణం అయ్యింది. ఇప్పుడు కూడా భారీగా వరాలు ప్రకటిస్తారని భావించారు. కానీ నేరుగా ఏ నిధులు కూడా ప్రకటించలేదు. దీనిపై ఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి ప్రతిపక్షాలు. కానీ గతానికి భిన్నంగా అమరావతికి సంపూర్ణ మద్దతు ఉంటుందని.. ఏపీ అభివృద్ధికి తనది భరోసా అంటూ మోడీ.. వరాలకు మించి అభయం ఇచ్చారు. గతానికి భిన్నంగా వ్యవహరించారు.
* అమరావతికి కేంద్రం సాయం..
వాస్తవానికి అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం భారీగా సాయం అందించింది. ఏకంగా వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సర్దుబాటు చేసింది. అమరావతి రాజధానికి అనుసంధానంగా కనెక్టివిటీ రహదారులు, రైలు మార్గాలు, ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు.. జాతీయ రహదారుల కనెక్టివిటీ ఇలా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎంత చేయాలో అంతలా అమరావతికి చేస్తున్నారు. 2014 కి మించి.. ఏపీ పట్ల ఉదార స్వభావం చూపుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). భవిష్యత్తులో కూడా ఏపీకి అన్ని విధాలా అండగా నిలబడతామని చెబుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఏమి ఇచ్చారని.. అమరావతికి ఎటువంటి వరాలు ప్రకటించకుండా వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నాయి.
* మారిన మోడీ వైఖరి..
ఏపీతో పాటు చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలి మారింది. 2018లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి చంద్రబాబు ఎన్డీఏ ను వీడారు. అందుకు తగ్గట్టు తర్వాత మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఈ ఎన్నికలకు ముందు చంద్రబాబు లో పూర్తిగా మార్పు కనిపించింది. 2018లో జరిగిన తప్పిదాన్ని గుర్తించి ప్రధాని మోడీకి మంచి మిత్రుడు గా మారారు. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అమరావతి కోసం పడుతున్న తపనను గుర్తించారు ప్రధాని మోదీ. అందుకే చంద్రబాబు విన్నపాన్ని మన్నించారు. దేశంలో ఉగ్రదాడి జరిగిన తరుణంలో భద్రతా కారణాల దృష్ట్యా అమరావతికి ప్రధాని హాజరయ్యే అవకాశం లేదు. కానీ తన మిత్రుడు చంద్రబాబు కోరికను మన్నించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
Also Read: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. పీవోకేను అప్రమత్తం చేసిన పాకిస్థాన్!