Amaravati Capital Dispute 2025: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో అమరావతి ఎంతలా నిర్వీర్యం అయిందో తెలుసు. ఇప్పటికీ అప్పటి పరిస్థితులను తలుచుకొని ఆందోళనకు గురవుతున్నారు అమరావతి రైతులు. అందుకే మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించి.. ఎవరూ కదిలించలేని స్థితికి చేర్చాలని విన్నవిస్తున్నారు. ఆపై అమరావతిపై వైయస్సార్ కాంగ్రెస్ చేసిన ప్రయోగాల నుంచి విముక్తి కల్పించాలని కూడా కోరుతున్నారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న అమరావతి రైతులు ఈ విషయంలో మాత్రం.. అవసరం అనుకుంటే ఉద్యమించాలని చూస్తున్నారు. ప్రధాన కారణం నాటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలే.
Also Read: కుప్పంలో సౌత్ కొరియా పరిశ్రమ కోసం చంద్రబాబు బిగ్ స్టెప్
ఏకాభిప్రాయంతో అమరావతి..
2014లో అధికారంలోకి వచ్చింది టిడిపి ప్రభుత్వం ( Alliance government ). నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అయితే పాలన గాడిలో పెట్టేందుకు దాదాపు ఏడాది పట్టింది. ఎందుకంటే అది విభజిత ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఏపీకి రాజధాని లేదు. ఎక్కడి నుంచి పాలన చేయాలో తెలియదు. అటువంటి సమయంలో పాలనను గాడిలో పెట్టి.. అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆపై రాజకీయపరంగా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐదేళ్ల పాలనాకాలం ఇట్టే ముగిసిపోయింది. అయితే రాజధానిని ఎంపిక చేసి పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు దానికి చట్టబద్ధత కల్పించలేకపోయారు. దీంతో తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ అమరావతి తో ఎంతలా ఆడుకోవాలో అంతలా ఆడుకుంది.
ఆ ఇళ్ల పట్టాల రద్దు కోసం
వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. కేవలం శాసన రాజధానిగా మాత్రమే అమరావతిని పరిమితం చేసింది వైసిపి ప్రభుత్వం. దీంతో అమరావతికి సేకరించిన వేల ఎకరాలను తిరిగి రైతులకు ఇవ్వలేదు. అలాగని మూడు రాజధానులు కట్టలేదు. అయితే ఆర్ 5 జోన్ అంటూ అమరావతి రైతులు ఇచ్చిన భూములను పేదలకు పని చేసేందుకు నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలకు అమరావతిలో ప్లాట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆర్5 జోన్ కేటాయింపులను రద్దు చేయాలని అమరావతి రైతులు కోరుతూ వచ్చారు. కానీ ఇంతవరకు కూటమి ప్రభుత్వం నుంచి చలనం లేదు. దీంతో వైసిపి హయాంలో యాక్టివ్ గా పని చేసిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి మరోసారి క్రియాశీలకం అయింది. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.
Also Read: అమరావతిలో తిరుపతి.. టీటీడీ గ్రీన్ సిగ్నల్!
చట్టబద్ధత కోసం..
గతంలో చట్టబద్ధత కల్పించి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని కాదని.. మూడు రాజధానులను అస్సలు తెరపైకి తెచ్చే అవకాశం లేదని నమ్ముతున్నారు అమరావతి రైతులు. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా చట్టబద్ధత కాలేదు. కనీసం ఇప్పుడైనా చట్టబద్ధత కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావని అమరావతి రైతులు భావిస్తున్నారు. పైగా ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. ఏపీ విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే చాలా ప్రయోజనం అని అమరావతి రైతులు భావిస్తున్నారు. ఒత్తిడి పెంచేందుకు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి రంగంలోకి దిగింది. చూడాలి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.