Resignation Pressure on BRS MLAs: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే బీఆర్‌ఎస్ నేతలు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని వ్యాఖ్యలు చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని బెదిరింపులకు దిగారు. దీంతో అలర్ట్ అయిన రేవంత్‌రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఫిరాయింపులకు తెరతీశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరితో మొదలైన ఫిరాయింపులు పది మంది వరకు జరిగింది. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత సుప్రీం కోర్టు తలుపు తట్టారు. విచారణ జరిపి త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. కానీ ఇప్పటికీ విచారణ కాకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టు స్పీకర్‌పై అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు అంశం మళ్లీ వేడెక్కింది.
Also Read: ఆ ఎమ్మెల్యేల మీద వేటు ఖాయం.. ఉప ఎన్నికలు వస్తే రేవంత్ అస్త్రం ఇదే!
రాజీనామా ఆలోచన..
10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిలో కొంతమందికి మాత్రమే రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కాంగ్రెస్‌లో నెలకొంది. కానీ ఈ వ్యూహంలో ప్రమాదం కూడా ఉంది. ఒకరిరెండు మంది ఓడిపోతే రాజకీయంగా నష్టం, అందరూ ఓడితే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీయొచ్చు. ఈ భయంలోనే సీఎం జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఫిరాయించిన వారిలో ఏడునుంచి ఎనిమిది మంది తాము ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదే సమయంలో విచారణ ఆధారంగా బీఆర్‌ఎస్ పిటీషన్‌ను తిరస్కరించే అధికారం స్పీకర్‌కు ఉంది. కానీ, దానం నాగేందర్, కడియం శ్రీహరితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి నెలకొంది.
స్పీకర్ ముందున్న బాధ్యత..
బీఆర్‌ఎస్ అధ్వర్యంలో స్పీకర్‌కు ఫిరాయింపు కేసులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిర్ధిష్ట కాలమానంలో నిర్ణయం ఇవ్వకపోతే నేరుగా కోర్టే జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇది స్పీకర్‌పై నేరుగా ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి తన ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఫిరాయింపు అంశాన్ని చట్టపరంగా, రాజకీయంగా సమతుల్యంగా నిర్వహించాలి. ఏదైనా తప్పు నిర్ణయం పార్టీకి నష్టం కాకుండా రాష్ట్రస్థాయిలో ప్రతికూలతను తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.. మంత్రి పదవి కోసం రామోజీరావు దగ్గరికి వెళ్లారు… ఆ తర్వాత ఏమైందంటే?
ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంశం తెలంగాణ రాజకీయాల్లో కేవలం వ్యక్తుల స్థాయికి పరిమితం కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నైతికత, పాలన స్థిరత్వంపై పరీక్షగా మారుతోంది. స్పీకర్ తీర్పు ఒకవైపు రేవంత్ రెడ్డి నేతృత్వాన్ని బలోపేతం చేసే అవకాశం ఇస్తే, మరోవైపు చట్టపరమైన ముప్పు కూడా తలెత్తవచ్చు.