Amaravati : అమరావతి( Amravati capital ) విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరి అభిప్రాయంతో అప్పటి టిడిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానులు ఏర్పాటు అయ్యాయి. ఈ తరుణంలో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా రాజధాని అంటూ లేకుండా పోయింది. అందుకే మరోసారి తప్పిదం జరగకుండా రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు కీలక తీర్మానం చేసింది. మరోసారి అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరగకుండా శాశ్వతంగా కట్టడి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆ పనులు చేస్తేనే సాధ్యం!
* కూటమితో అమరావతికి ఊపిరి..
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి( TDP Alliance) గెలవడంతో అమరావతికి ఊపిరి వచ్చింది. ఒకవేళ తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధాని మారకుండా ఉండాలంటే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమావేశమైన క్యాబినెట్ అమరావతిని నిర్ధారిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా 2014లో చేసిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. వాస్తవానికి 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ప్రకటించింది. నాడు అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే.. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండేది కాదు. అందుకే మరోసారి జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం ఇవ్వకుండా చూడాలని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
* గెజిట్ ఇవ్వనందునే..
2015 లో అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది టిడిపి ప్రభుత్వం. గెజిట్ నోటిఫికేషన్( Gegit notification) ఇప్పించకుండానే పనులు చేసుకుంటూ పోయింది. కానీ మధ్యలో అధికారం మార్పుతో వైసిపి ప్రభుత్వం రావడం.. గెజిట్ లేదన్న కారణం చూపుతూ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో.. ఈ రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా పోయింది. అందుకే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి తమకు గెజిట్ ఇప్పించాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గెజిట్ కేంద్రం చేతుల్లో ఉందని… తమ వైపు నుండి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తామంటూ చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఇప్పుడు దానికి అనుగుణంగా క్యాబినెట్ అమరావతి రాజధాని అంటూ తీర్మానం చేసింది. దానిని కేంద్రానికి పంపనుంది. పార్లమెంటులో ఏపీ విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రతిపాదించి.. అందులో అమరావతి రాజధానిగా చేర్చి.. విజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
* వేగంగా అమరావతి పనులు..
ఈనెల రెండున ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. చంద్రబాబు మూడేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతి రాజధాని కి సంబంధించి అన్ని రకాల పనులు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కాయి. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి శాశ్వత రాజధాని అంటూ రైతులకు భరోసా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం చేసింది. పార్లమెంట్లో చట్టం చేస్తూ అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం తప్పకుండా ప్రకటించే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరిగేనా?