Amaravati Tirupati economic regions: రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం( Alliance government ) ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తోంది. విశాఖలో ఐటి పరిశ్రమల ఏర్పాటు జరుగుతోంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం వస్తున్నాయి. ఇంకోవైపు రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటం వ్యాలీ వంటిని అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక ప్రాంతాలుగా విభజించి ప్రోత్సాహం అందించాలని భావిస్తోంది.
ఆర్థిక మండళ్లు ఏర్పాటు..
తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతి( Amravati ), తిరుపతి ఆర్థిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. గత ఏడాది నవంబర్ 13న విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ను ప్రకటించింది. ఇప్పుడు ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రధాన ఆర్థిక మండలాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రాంతీయ మాస్టర్ ప్లాన్ ల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ రీజియన్లు పనిచేయనున్నాయి. సుమారు 44 వేల 962 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అమరావతి ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేశారు.
అమరావతి పేరుతో..
అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అదే అమరావతి పేరుతో ఎకనామిక్ రీజియన్( economic region) ఏర్పాటు అయింది. దీంట్లో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం తో ఇది ఏర్పాటు కానుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ దీనికి సీఈవోగా నియమితులయ్యారు. మరోవైపు అమరావతి రీజియన్లు మరో తొమ్మిది జిల్లాలను కలిపారు. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, వైయస్సార్ కడప, శ్రీ సత్య సాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అన్నమయ్య జిల్లాలు తిరుపతి రీజియన్ లో ఏర్పాటు చేశారు. దీనికి సీఈవోగా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.
మరింత మెరుగ్గా ప్రాంతీయ అభివృద్ధి..
ఎకనామిక్ రీజియన్ లతో ప్రాంతీయ అభివృద్ధి సాధ్యం. ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధి, సంస్థాగత భాగస్వామ్యాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే వీటి ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉంటే పాలనాపరమైన నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. అదే ప్రాంతాలవారీగా ఉండి కీలకమైన అధికారులకు బాధ్యతలు అప్పగిస్తే పాలనాపరమైన నిర్ణయాలు జాప్యం ఉండే అవకాశం ఉండదు. కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విశాఖ, అమరావతి, తిరుపతి ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేసింది. కచ్చితంగా ఈ విధానంతో మంచి ఫలితాలు వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.