Amanchi Krishna Mohan: పోయిన చోటే వెతుక్కోవాలని చూస్తున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బలపడాలని భావిస్తున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చూస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 9న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై సమరం మొదలు పెట్టనున్నారు. దానిని చివరి వరకు కొనసాగించాలని చూస్తున్నారు. 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను అనుసరించనున్నారు. రాజకీయంగా అవకాశాలు లేని బలమైన నేతలను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేతను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ విషయంలో వై వి సుబ్బారెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ద్వారా జరిగిన డ్యామేజ్ ను భర్తీ చేసేందుకు ఆమంచి కృష్ణమోహన్ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
ప్రోత్సహించిన రాజశేఖర్ రెడ్డి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఆ పార్టీకి బలమైన నేతగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. ఈయన వై వి సుబ్బారెడ్డి కి స్వయానా బావ. వైయస్ జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. ఈ లెక్కన శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి బాలినేని కి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. 2004లో తొలిసారిగా టిక్కెట్ ఇవ్వగా ఆయన గెలిచారు. దీంతో తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009లో గెలిచిన బాలినేని ని మరోసారి మంత్రి పదవి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. 2014లో బాలినేని ఓడిపోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండిపోయింది. ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు బాలినేని. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని ని మంత్రిని చేశారు జగన్. కానీ విస్తరణలో తొలగించేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అది మొదలు అనేక రూపాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కు గురి చేస్తూ వచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనలో చేరిపోయారు బాలినేని.
బాలినేని నిష్క్రమణతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ బాలినేని జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక రూపాల్లో ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇవి జగన్మోహన్ రెడ్డిని ఎంతో బాధించాయి. అలాగని ప్రకాశం జిల్లాలో బలమైన నేతలు లేరు. కరణం బలరాం ఉన్న ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Bhaskar Reddy ) స్థానికేతరుడు. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరం. బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుడు అవసరం. అందుకే ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో రాయబారాలు పూర్తయ్యాయని… త్వరలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరుతారని ప్రకాశం జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆమంచి కృష్ణమోహన్. 2000లో వేటపాలెం కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో దివంగత రోశయ్య ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి చీరాల నుంచి గెలిచారు. 2014లో ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. రికార్డ్ సృష్టించారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఆ ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన ఆధిపత్యంలో కరణం బలరాం వైపు జగన్ నిలిచారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ మనస్థాపానికి గురై 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీని దెబ్బతీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. కానీ ఆయనను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి..