Alluri Sitarama Raju District Accident: ఏపీలో( Andhra Pradesh) మరో విషాద ఘటన. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తీవ్ర గాయాలకు గురయ్యారు. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వస్తున్న ప్రయాణికుల బస్సుకు ప్రమాదం ఏర్పడింది. దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సు చిత్తూరు జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. పొగ మంచుతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన తో సరిహద్దు ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శతకాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
* చింతూరు ఘాట్ రోడ్ వద్ద..
అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju ) జిల్లా చింతూరు ఘాట్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘటనా స్థలంలో 8 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు కన్నుమూశారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
* చిత్తూరు జిల్లా నుంచి..
చిత్తూరు జిల్లా( Chittoor district) నుంచి పర్యాటకులు కొంతమంది పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరారు. ఇందులో ఐటి ఉద్యోగులు కూడా ఉన్నారు. భద్రాచలం వెళ్లి స్వామివారి దర్శనం అనంతరం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వీరంతా బయలుదేరారు. రోడ్డు వంకరలు, పొగ మంచు, డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడం వంటి కారణాలతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం లోతైన అటవీ ప్రాంతం కావడంతో.. రెస్క్యూ ఆపరేషన్ కష్టంగా మారింది. భారీ యంత్రాల సాయంతో మృతదేహాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. అయితే ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.