Allu Arjun: వైసిపి పక్కా ప్లాన్ తోనే.. అల్లు అర్జున్ వివాదం రాజేసిందా?

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆయనే స్వయంగా స్పందించారు. ఈరోజు హైదరాబాదులో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Written By: Dharma, Updated On : May 13, 2024 2:36 pm

Allu Arjun

Follow us on

Allu Arjun: అల్లు అర్జున్ వైసీపీ వ్యూహంలో చిక్కుకున్నారా? బన్నీ నంద్యాల పర్యటనను ఆ పార్టీ వ్యూహాత్మకంగా వాడుకుందా? అది ముందస్తు ప్రణాళికలో భాగమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆరోజు నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ సతీసమేతంగా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే క్షణాల్లో అక్కడ వేలాదిమంది గుమిగూడడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు అయ్యింది.ఎలక్షన్ కమిషన్ కేసు నమోదు చేయడంతో.. ఇదో వివాదాస్పద అంశంగా మారిపోయింది.మెగా కుటుంబంలో చీలిక వచ్చిందంటూ ప్రచారానికి కారణమైంది.

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. ఆయనే స్వయంగా స్పందించారు. ఈరోజు హైదరాబాదులో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.’ నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మామయ్య పవన్ కళ్యాణ్ కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్తులో మా మామయ్య చంద్రశేఖర్ గారు, బన్నీ వాస్.. ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వారికి మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తా. శిల్పా రవి 15 ఏళ్లుగా నాకు మిత్రుడు. బ్రదర్ మీరు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే.. మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తా అని మాటిచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనబడాలని నా మనసులో ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి నేనే ఫోన్ చేసి వస్తానని చెప్పాను. అందుకే నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లాను. వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేసాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అంటూ.. అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

అయితే అల్లు అర్జున్ పర్యటనను వైసిపి ఉద్దేశపూర్వకంగానే వివాదం చేసినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. కానీ వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా అల్లు అర్జున్ వచ్చేసరికి.. పట్టణ శివారు నుంచి భారీ వాహనాలు, మోటార్ సైకిల్ తో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకు వచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులు లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా ఫ్రీ ప్లాన్ గా చేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం, అదే విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. అల్లు అర్జున్ తమ వాడిగా వైసీపీ చెప్పడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసింది.