Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు ఆకాశం నుంచి నేలకు జారినట్లు అయింది. జగన్ తో ఆళ్ల కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. మంగళగిరి నియోజకవర్గం బీసీలదే అనుకున్నప్పటికీ జగన్ మాత్రం రామకృష్ణ రెడ్డికి 2014, 2019 ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో లోకేష్ పై గెలుపొందితే రామకృష్ణారెడ్డిని మంత్రిని చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు. కానీ ఆ మాట తప్పరు. ఇప్పుడు ఈ ఏకంగా టిక్కెట్ లేదని తేల్చేశారు. పొమ్మనలేక పొగ పెట్టారు.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా యాక్టివ్ గా ఉండేవారు. జగన్ కోసం ఏకంగా చంద్రబాబుపై తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో వ్యక్తిగతంగా కేసులు కూడా వేశారు. టిడిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అగ్రిగోల్డ్ ఆస్తులు, సదా వతి భూములు తదితర వ్యవహారాల్లోనూ కూడా కోర్టులో కేసులు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో అసైన్మెంట్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబుపై ఏపీ సిఐడికి ఆర్కే ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు పేరు చేర్చాలని, కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సిబిఐకి బదలాయించాలని కోరుతూ ఏకంగా పిల్ వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ చేతిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పావుగా మారారు. తాను అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనన్న విషయాన్ని మర్చిపోయారు. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సర్వేల్లో వెనకబడ్డారు. ఇప్పుడు టిక్కెట్టు దక్కదని తెలిసి.. పార్టీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం వెనుక ఆయన స్వయంకృతాపం ఉంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డిని బొమ్మన లేక పొగ పెట్టారని స్పష్టంగా తెలుస్తోంది. మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్, టిడిపి బీసీ నేత గంజి చిరంజీవిని వైసీపీలోకి తీసుకొచ్చారు. వెంటనే వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో ఆయన ఒక అధికార కేంద్రంగా మారిపోయారు. దీని వెనుక పార్టీ పెద్దలు ఉన్నట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అనుమానం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని మంగళగిరి తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అంతేకాక ఆర్కే కి వ్యతిరేకంగా వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని చిరంజీవి ప్రారంభించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ పరిణామాలన్నీ గమనించిన ఆర్కే పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా రోజుల కిందటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు దాక్కకపోవడంతో పార్టీ నుంచి నిష్క్రమించడానికి నిర్ణయం తీసుకున్నారు. జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నా సంత కుమారుడి పెళ్లి కూడా ఆహ్వానించలేదు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో పనులు చేయిస్తున్నాను. అప్పుల పాలయ్యాను. ఇంకా డబ్బులు పెట్టి రాజకీయం చేయలేను. దేవుడు ఏ మార్గంలో చెబితే ఆ దారిలో వెళ్తానంటూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఏకంగా హై కమాండ్ కు షాక్ ఇస్తూ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. సొంత వ్యక్తికే ఇలా చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన చాలామంది సిట్టింగ్ లలో కనిపిస్తోంది.