AP Survey: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. వైసిపి ఒంటరి పోరుకు సిద్ధపడుతుండగా.. టిడిపి, జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నాయి. బిజెపి ఈ కూటమితో కలిసి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై స్పష్టత లేదు. కాంగ్రెస్, వామపక్షాలు ఎటువైపు వెళ్తాయో తెలియడం లేదు. ఈ తరుణంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ఏపీలో పబ్లిక్ పల్స్ ను బయటపెట్టారు. ఇక్కడి నుంచి వారం వారం ప్రజాభిప్రాయాన్ని వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధ దాస్ ప్రజల మూడ్ ను స్పష్టంగా తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ ఫలితాలు వచ్చాయి. ఏపీలో తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలను బయటపెట్టారు. వైసిపికి 46% ప్రజల మద్దతు ఉంది. టిడిపికి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు. ఇతరులకు ఒక శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని విశ్లేషించారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వైసీపీకి 48%, టిడిపికి 43%, జనసేనకు ఎనిమిది శాతం ప్రజల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీకి ఒక శాతం మద్దతు ఉందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు అన్నదానిపై ప్రజాభిప్రాయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ 46% మంది ప్రజలు కోరుకుంటుండగా.. చంద్రబాబు సీఎం కావాలని 36% మంది ప్రజలు కోరుకుంటున్నారు. లోకేష్ కు 8 శాతం, పవన్ కళ్యాణ్ కు 10 శాతం మంది కోరుకుంటున్నారు. ఇక ప్రధానికి సంబంధించి 42 శాతం మంది ప్రజలు మోడీకి, 39 శాతం మంది రాహుల్ గాంధీని కోరుకుంటున్నట్లు ఈ పల్స్ తెలియజేస్తోంది. ఏపీలోని రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో ఈ పల్స్ సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇకనుంచి ప్రతివారం ఇదేవిధంగా అంచనాలను వెల్లడిస్తామని పార్థ దాస్ వెల్లడించారు. మొత్తానికైతే టిడిపి జనసేన కూటమిపరంగా ముందంజలో ఉండగా.. పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే వైసిపి ముందంజలో ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కంటే పది శాతం మంది ప్రజలు జగన్ ను కోరుతుండడం విశేషం.