AP Elections 2024: గుంటూరు పార్లమెంట్ స్థానం అంటేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. అక్కడ పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఎంపీగా గల్లా జయదేవ్ గెలిచారు. జగన్ ప్రభంజనంలో సైతం విజయం సాధించారు. అయితే ఆయన ఉన్నఫలంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. పెమ్మసాని చంద్రశేఖర్ పేరును ప్రకటించింది. తొలు తా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా క్రికెటర్ అంబటి రాయుడు పేరు బలంగా వినిపించింది. కానీ పార్టీలో చేరిన పది రోజులకే రాజీనామా చేశారు. సీఎం జగన్ కు హ్యాండ్ ఇచ్చారు. అప్పటినుంచి గుంటూరు అభ్యర్థి కోసం జగన్ చేయని ప్రయత్నం లేదు. పరిశీలించని పేరు లేదు. చివరకు పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోశయ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈయన సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. అయితే ఇప్పుడు ఈయన సైతం పోటీ చేసేందుకు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడును పార్టీలోకి రప్పించి ఎంపీగా పోటీ చేయించాలని జగన్ వ్యూహరచన చేశారు. కానీ అది ఎందుకో బెడిసి కొట్టింది. అభ్యర్థిగా ప్రకటించక ముందే అంబటి రాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. అటు తరువాత నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించాలని జగన్ భావించారు. కానీ ఆయన సైతం వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా మరోసారి రంగంలోకి దిగారు.
పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలించారు. లోక్సభ ఇన్చార్జిగా అప్పట్లో ప్రకటించారు. కానీ ఆయన రోజులు గడుస్తున్నా ఆ నియోజకవర్గం వైపు చూసిన దాఖలాలు లేవు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పై వెంకటరమణ దృష్టి ఉండేది. కానీ అక్కడ మంత్రి విడదల రజినికి జగన్ ఛాన్స్ ఇచ్చారు. చిలకలూరిపేటలో రజిని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆమెను మార్చాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన వెంకటరమణకు గుంటూరు పార్లమెంట్ సీటు కేటాయించినా పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో జగన్ దృష్టి పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి రోశయ్య పై పడింది. ఆయనకు గుంటూరు పార్లమెంట్ సీటును కేటాయించారు. పొన్నూరు కు వేరే అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తనకు గుంటూరు పార్లమెంట్ స్థానం ఆసక్తి లేదని కిలారి రోశయ్య తేల్చి చెప్పారు. తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి వైసీపీ పెద్దలను ఆశ్రయించారు. తనకు తిరిగి పొన్నూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అధికార వైసీపీలో ఇదో ఆసక్తికర పరిణామంగా మారింది.
అయితే ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుంటూరు సమన్వయ బాధ్యతలను ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చూస్తున్నారు. కిలారి రోశయ్య వెనుకడుగు వేయడంతో.. తన సోదరుడికి టిక్కెట్ ఇవ్వాలని అయోధ్య రామిరెడ్డి ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి జగన్ అనుమతి లభించాల్సి ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో పాటు గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ లోకి రప్పించినట్లు ప్రచారం జరిగింది. ఒకానొక దశలో గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు ఖరారు చేస్తారని టాక్ నడిచింది. మధ్యలో కిలారి రోశయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రోశయ్య విముఖత చూపడంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తెరపైకి తెస్తారని.. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.