Sankranthi Holidays: సంక్రాంతి పండుగ తెలుగు రాస్ట్రాల్లో అంత్యత ప్రసిద్ధమైంది. ఈ పండుగ ప్రజలందరికీ ఆనందాన్ని ఇస్తుంది. పంటలు ఇళ్లకు వచ్చే వేళ రైతులు సంబురంగా చేసుకునే పండుగా, గ్రామీణులకు ఎక్కువ ప్రాధాన్యం, ప్రాశస్త్యం ఈ పండుగకే ఉంది. ఇక పట్టణాల్లో గాలిపటాలతోనే పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో దసరా, సంక్రాంతి పండుగలకు పది రోజుల చొప్పున సెలవులు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం దసరాను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సెలవులను పెంచింది. ఇదే సమయంలో సంక్రాంతిని ఆంధ్రుల పండుగగా భావిస్తూ సెలవులు కుదించింది. తాజాగా రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా సంక్రాంతి సెలవుల్లో ఇంకా మార్పులు చేస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి 13, 14 తేదీల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ జనవరి 10 నుంచి 18 వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అయితే తాజాగా ఈ సెలవుల్లో మార్పులు చేస్తోంది.
రెండు రాష్ట్రాల్లో మార్పులు..
తెలంగాణతోపాటు ఏపీలో కూడా సంక్రాతి సెలవుల విషయంలో తర్జన భర్జన జరుగుతోంది. ఇప్పటికీ మార్పులు చేర్పులు చేస్తున్నారు అధికారులు. ఏపీలో పదో తరగతి పరీక్షల దృష్ట్యా సంక్రాంతి సెలవుల్లో మార్పులు జరుగుతున్నాయి. చివరకు జనవరి 10 నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 19 వరకు సెలవులు కొనసాగుతాయి. 20న విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి. క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం జనవరి 11 నుంచి 15 వరకు మాత్రమే సెలవులు.
తెలంగాణలో ఇలా..
ఇక తెలంగాణ విద్యాశాఖ జనవరి 11 నుంచి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. 19న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. ఇది ఉంటే.. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్‌లోని సెటిలర్స్ అంతా ఆంధ్రాకు వెళ్తారు. దీంతో సగానికిపైగా హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలో హాస్టళ్ల యజమానులు ఓ నిర్ణయానికి వచ్చారు. జనవరి 12 నుంచి 17 వరకు హాస్టళ్లు మూసివేయాలని నిర్ణయించారు. దీనిని అన్ని హాస్టళ్లు పాటించాలని స్పష్టం చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే రూ.20 వేల జరిమానా విధిస్తామని ప్రకటించింది. అయితే హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునేవారు మాత్రం తాము 30 రోజులకు ఫీజు చెల్లించామని ఐదు రోజులు హాస్టళ్లు మూసివేస్తే ఎక్కడ తినాలని ప్రశ్నిస్తున్నారు. పండుగల వేళ హోటళ్లు కూడా మూతపడతాయని పేర్కొంటున్నారు.