https://oktelugu.com/

Aghori Mata: ఇదేం మీడియా.. వార్తల్లేవా? ప్రజా సమస్యలు లేవా? ఇంతలా అఘోరించాల్సిన అవసరం ఏమొచ్చింది?

మీడియా అంటే పారదర్శకంగా ఉండాలి. ప్రజల సమస్యల గురించి పట్టించుకోవాలి. వాటిని వెలుగులోకి తేవాలి. పరిష్కార బాధ్యత ప్రభుత్వం ముందు ఉంచాలి. మీడియా బాధ్యతాయుతంగా మెలగాలి. అప్పుడే పారదర్శకత అనే పదం మీడియాకు వర్తిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో మీడియా వీటికి దూరంగా ఉంటోంది.

Written By:
  • Bhaskar
  • , Updated On : November 20, 2024 / 12:32 PM IST

    Aghori Mata(1)

    Follow us on

    Aghori Mata: ఇటీవల కాలంలో హైదరాబాదులో ఓ అఘోరి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మీడియా మొత్తం అఘోరీ వెంట పరుగులు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆ అఘోరి తో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాయి. “మీరు ఎలా ఉంటారు,? ఎక్కడ ఉంటారు? ఒంటికి బూడిద ఎందుకు పూసుకుంటారు? మెడపై ఆ కపలాలు ఎందుకు? నెత్తి ని అలా ఉంగరాలుగా ఎందుకు చుట్టుకుంటారు?” అనే తీరుగా ప్రశ్నలు అందించారు. వాస్తవానికి ఇవేవీ జనానికి అవసరం లేదు. ఎందుకంటే హిమాలయాల్లో ఉండే అఘోరీ లు బయటికి రారు. వారు మొత్తం తపస్సులో ఉంటారు. శివుడిని ధ్యానిస్తూ ఉంటారు. అతని నామస్మరణ కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో శ్వాస బంధనం అనే ప్రక్రియను కూడా అవలంబిస్తారు. అయితే వీటి గురించి కనీస అవగాహన లేకుండా.. అఘోరి వచ్చిందని తెలియగానే మీడియా అఘోరి వెంటపడింది. ఇష్టానుసారంగా పరుగులు పెట్టింది. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత నాలుక కరుచుకుంది.

    ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తీరు

    తెలంగాణ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ అఘోరీ తీరు ఇలాగే కొనసాగింది. అఘోరి పేరుతో ట్రాన్స్ జెండర్ తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోనూ సందడి చేసింది. ఒంటికి బూడిద పూసుకొని తిరుగుతోంది. మీడియా తన వెంట తిరుగుతుందని భావించి.. ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. చివరికి మీడియా ప్రతినిధుల పైన అఘోరి దాడులు చేసింది. ఇంత దారుణానికి పాల్పడినా మీడియా ఆ అఘోరి వెంటే తిరుగుతోంది. పైగా ఆ అఘోరి కూడా చిత్రచిత్రమైన వ్యాఖ్యలు చేస్తోంది..”పవన్ కళ్యాణ్ రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కష్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కానీ.. దానికి చాలా చేయాల్సి ఉంది. శాంతి యాగాలు.. యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ నేను చేస్తాను. నాకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కావాలి” ఇలా మీడియా ఎదుట ఆ అఘోరి వ్యాఖ్యలు చేస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే విషయాల గురించి పట్టించుకోని మీడియా.. వాటిని ఇష్టానుసారంగా ప్రసారం చేస్తోంది. పోటాపోటీగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగముంటుంది? ఇవి ఏ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాయి? అనే విషయాలను పక్కనపెట్టి కేవలం టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే మీడియా నేలబారుతనాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆ అఘోరి ఇలాంటి వ్యాఖ్యల చేసింది. రేవంత్ రెడ్డికి కష్టాలు తప్పవని స్పష్టం చేసింది. వాస్తవానికి అఘోరి అంటే దేవాలయాలు తిరగాలి. భక్తులతో మంచి మాటలు చెప్పాలి. అవకాశం ఉంటే ప్రవచనాలను వివరించాలి. కానీ దానిని పక్కనపెట్టి పబ్లిసిటీ కోసం అఘోరి ప్రయత్నాలు చేయడం నిజంగా విడ్డూరం. ఆ అఘోరి వెనక మీడియా పడటం మరింత చెండాలం.