Adari Anand Kumar : వైసిపికి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం పదవులు వదులుకొని మరి పార్టీకి వీడ్కోలు పలుకుతున్నారు. కూటమి పార్టీలో చేరుతున్నారు. దాదాపు చిన్నాచితకా నేతలు 50 మంది వరకు గోడ దూకేశారు. ఇటీవలే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, గ్రంధి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. అదే బాటలో మరికొందరు ఉన్నట్లు ప్రచారం నడిచింది. ఇంతలో విశాఖకు చెందిన వైసీపీ నేత అడారి ఆనంద్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆనంద్ కుమార్ ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈరోజు రాజీనామా చేస్తూ అధినేత జగన్ కు లేఖ రాశారు.
* విశాఖ డెయిరీ చైర్మన్ పదవికి
అడారి ఆనంద్ కుమార్ విశాఖ డెయిరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత అనేక రకాల ఒత్తిళ్ళతో వైసీపీలో చేరారు.ఈ ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. గత కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అదే సమయంలో విశాఖ డైరీ కార్యకలాపాలపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో అడారి ఆనంద్ కుమార్ వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విశాఖ డైరీ చైర్మన్ పదవికి సైతం రాజీనామా చేయడం విశేషం. ఆయనతో పాటు చాలామంది డైరెక్టర్లు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు.
* సుదీర్ఘకాలం టిడిపిలో
ఆనంద్ కుమార్ తండ్రి అడారి తులసిరావు విశాఖ డైరీ వ్యవస్థాపకుడు. సుదీర్ఘకాలం విశాఖ డైరీ చైర్మన్ గా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ఎన్నడు కాంగ్రెస్ పార్టీ వైపు చూడలేదు. అయితే అడారి ఆనంద్ కుమార్ మాత్రం బెదిరింపులకు భయపడిపోయారు. వైసీపీలో చేరారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి ఆ పార్టీకి దూరమయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం.