Manchu Manoj: ప్రముఖ నటుడు మంచు మనోజ్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అడుగుపెట్టారు. భార్య మౌనిక రెడ్డి, కుమార్తె దేవసేన తో కలిసి అత్తారింటికి వచ్చారు. ఈరోజు మాజీ మంత్రి శోభా నాగిరెడ్డి జయంతి కావడంతో ఆమె సమాధికి నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తండ్రితో విభేదాలు రావడంతో మనోజ్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి మూల కారణం మనోజ్ భార్య మౌనిక రెడ్డి అని మోహన్ బాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో భార్య మౌనిక రెడ్డి తో కలిసి ఆళ్లగడ్డలో అడుగుపెట్టారు మనోజ్.దీంతో సంచలన ప్రకటన చేస్తారని అంతా భావించారు. అందుకే ఆళ్లగడ్డ వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
* శోభా నాగిరెడ్డి కి నివాళులు
ముందుగా శోభా నాగిరెడ్డి సమాధి వద్ద మనోజ్ దంపతులు నివాళులు అర్పించారు. ప్రఖ్యాత అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. దిగువ అహోబిలంలో లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. వారి వెంట భూమా విఖ్యాత్ రెడ్డి ఉన్నారు. మనోజ్, మౌనిక రెడ్డి దంపతులు జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దీంతో వీరి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో మనోజ్ కానీ.. మౌనిక రెడ్డి కానీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయం కావచ్చని ప్రచారం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న భూమా కుటుంబ అనుచరులు కూడా ఈ వార్త తెలియడంతో వారు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
* మెగా కుటుంబంతో అనుబంధం
భూమా కుటుంబానికి మెగా కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో భూమా నాగిరెడ్డి అటువైపు మొగ్గు చూపారు. 2009లో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఆళ్లగడ్డ నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆమె కోసం పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేశారు. అప్పటినుంచి మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన భూమా అఖిలప్రియకు మద్దతుగా జనసేన నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అందుకే మనోజ్, మౌనిక రెడ్డి దంపతులు తప్పకుండా జనసేనలో చేరుతారని ప్రచారం నడిచింది. ఇదే విషయాన్ని ఆళ్లగడ్డ పర్యటనలో మనోజ్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే జనసేనలో చేరిక విషయంలో ఇప్పట్లో చెప్పలేనని మనోజ్ తోసిపుచ్చడం విశేషం. మనోజ్ రాజకీయ ప్రకటన చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ అటువంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.