https://oktelugu.com/

AP Volunteers: వాలంటీర్లను కొనసాగిస్తారా? తొలగిస్తారా?

AP Volunteers: వైసిపి అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్ల చుట్టూ జరిగిన వివాదం అంతా ఇంతా కాదు. ఈ వ్యవస్థను ఎక్కువగా పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. మనుషుల అక్రమ రవాణాకు వారే కారణమని..

Written By:
  • Neelambaram
  • , Updated On : June 18, 2024 / 10:15 AM IST

    Abolition of Volunteer System In AP

    Follow us on

    AP Volunteers: తమకు ఉద్యోగాల్లో కొనసాగించాలని వాలంటీర్లు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతల ఆదేశాలతో వాలంటీర్ పదవికి చాలామంది రాజీనామా చేశారు. అటువంటి వారంతా ఇప్పుడు బాధపడుతున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టిడిపి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉంటే.. లక్ష మందికి పైగా రాజీనామా చేశారు. వైసీపీకి స్వచ్ఛందంగా సేవలు అందించారు. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఏజెంట్లుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. దీంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అనవసరంగా వైసీపీ నేతల మాటలు నమ్మి చేజేతులా ఇబ్బందులు తెచ్చుకున్నామన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.

    Also Read: Jagan: 30 మంది సెక్యూరిటీ జగన్ ఇంటి లోపలికి.. అసలేం జరిగింది?

    వైసిపి అధికారంలో ఉన్న సమయంలో వాలంటీర్ల చుట్టూ జరిగిన వివాదం అంతా ఇంతా కాదు. ఈ వ్యవస్థను ఎక్కువగా పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. మనుషుల అక్రమ రవాణాకు వారే కారణమని.. వారి ద్వారానే సమాచారం బయటకు వెళుతోందని.. కొందరు అఘాయిత్యాలు చేసేందుకు సైతం వెనుకడుగు వేయడం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీంతో ఆ కామెంట్స్ దుమారానికి దారి తీశాయి. అయితే చంద్రబాబు సైతం వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్నికలకు ముందు వాలంటీర్లు పెద్ద ఎత్తున రాజీనామా చేశారు.దీనిపై స్పందించిన చంద్రబాబు రాజీనామా చేయొద్దు అంటూ వారించారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. పదివేల రూపాయలకు వేతనం పెంచడంతోపాటు ఇతరత్రా రాయితీలు సైతం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పట్టణాలు, నగరాల పరిధిలో వాలంటీర్లు రాజీనామా చేయలేదు. రాజకీయ ప్రభావం అధికంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.

    Also Read: Jagan: జగన్‌ ఇంటిని టచ్‌ చేశాడు.. ఉద్యోగం ఊడింది..!

    వైసిపి అధికారం కోల్పోవడంతో.. ఆ పార్టీకి నమ్మిన బంటులు, పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవారు వాలంటీర్ పోస్టులపై ఆశలు వదులుకున్నారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా, అదో ఉపాధి మార్గంగా ఎంచుకున్న వారు మాత్రం మరోసారి ఆ పోస్టును కోరుకుంటున్నారు. టిడిపి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణ విషయంలో ఎటువంటి ప్రకటన రావడం లేదు. ముఖ్యంగాడిగ్రీ అర్హతతో అతి తక్కువ పోస్టులు తీస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రులకు శాఖల కేటాయింపులో సైతం వాలంటీర్ వ్యవస్థ బాధ్యతను ఓ మంత్రికి అప్పగించారు. దీంతో తప్పకుండా పునరుద్ధరిస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. మరోవైపు టిడిపి శ్రేణులు సైతం తమ వారికే వాలంటీర్ పోస్టులు రావాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారంతా వైసిపి సానుభూతిపరులని.. వారిని కొనసాగిస్తే లాభం లేదని చెబుతున్నారు. అందుకే రాజీనామా చేయని వాలంటీర్లు, రాజీనామా చేసిన వాలంటీర్లలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.