NRI News : అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులు, భారత సంతతి వ్యక్తుల కిడ్నాప్‌లు, దాడులు, హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా న్యూజెర్సీలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికే చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్‌కౌర్(29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో మరో మహిళ, జస్వీర్ బంధువు గగన్ దీప్ కౌర్(20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.
నిందితుడిది పంజాబే..
నిందితుడు గిల్ పంజాబ్‌లోని నకోదర్‌లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని తెలిసింది. బాధితులు జలంధర్లోని నూర్‌మహల్‌కు చెందిన వారని సమాచారం. నిందితుడు గౌరవ్ గిల్‌ను అమెరికా పోలీసులు హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.
ఇంట్లో ఉండగానే..
హత్యకు గురైన జస్వీర్ కౌర్ తన బంధువు గగన్ దీప్‌కౌర్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో గిల్ కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పులకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELT కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బాధిత కుటుంబానికి న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేసింది.