Farmer: ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 800 కిలోమీటర్లు ఎడ్ల బండి పై వచ్చాడు ఓ రైతు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా?అనంతపురం జిల్లా హిందూపురం నుంచి..ఎక్కడికి వచ్చాడో తెలుసా? మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయానికి..ఎన్ని రోజులు ప్రయాణించాడో తెలుసా? అక్షరాలా 28 రోజులు. వినడానికి వింతగా ఉంది కదూ.కానీ ఇది వాస్తవం. దళారీ వ్యవస్థకు రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పాలని ఓ రైతు ఇలా ఆరాటపడ్డాడు. సాగులో ఎదురవుతున్న నష్టాలను ఎదుర్కోలేక చాలామంది బలవన్మరణానికి పాల్పడుతున్న తీరును చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో తన సొంత గ్రామం నుంచి ఎడ్ల బండి పై అమరావతికి బయలుదేరాడు. దాదాపు 28 రోజులపాటు ప్రయాణించి గమ్యానికి చేరుకున్నాడు. మూడు రోజుల కిందట మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు. పవన్ నుంచి పిలుపు వస్తుందని పరితపించాడు. కానీ పిలుపు రాకపోవడంతో చలిలో తీవ్ర అసౌకర్యం మధ్య గడుపుతున్నాడు. సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తపరిచాడు.
* రైతుల కష్టాలను వివరించేందుకు..
అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట కు చెందిన నవీన్ కుమార్ అనే యువరైతు.. తమ కష్టాలను వివరించేందుకు జనసేన కార్యాలయం ఎదుట మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. రైతుల సమస్యలను పవన్ కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్ల బండి పై వచ్చినట్లు కార్యాలయ సిబ్బందికి తెలియజేశాడు. కార్యాలయం గేటు బయట చలికి వణుకుతూ..ఎండకు ఎండుతూ ఇబ్బంది పడుతున్నాడు. చలి తీవ్రతకు ఎద్దుల సైతం అనారోగ్యానికి గురైనట్లు చెబుతున్నాడు. తినడానికి గడ్డి కూడా లేదంటూ.. మేత ఇవ్వాలని చుట్టుపక్కల రైతులను ప్రాధేయపడుతున్నాడు. రైతు సమస్యలను చెప్పేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు.
* పవన్ తోనే సమస్యలు పరిష్కారం అవుతాయని..
రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారు పవన్ కళ్యాణ్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులకు.. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దీంతో రైతులు పవన్ విషయంలో కొంత సానుకూలతతో ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని నాడు పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయానికి గిట్టుబాటుతో పాటు పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. తాజాగా ఈ యువరైతు ఆక్రందనతో రైతు సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నదాతలు సంతోషిస్తున్నారు. ఆ యువరైతుకు పవన్ ను కలిసే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆ యువ రైతు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.