Sathya Sai District: తల్లిని భారంగా భావించి.. నడిరోడ్డుపై విడిచిపెట్టి పరార్

వృద్ధాప్యంలో ఉన్న తల్లికి చేదోడువాదోడుగా నిలవాల్సిన కుమారుడు.. వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. బస్సులో వేరే గ్రామంలో దింపి పరారయ్యాడు. దీంతో ఆ వృద్ధురాలు వృద్ధాశ్రమానికి చేరుకోవాల్సి వచ్చింది.

Written By: Dharma, Updated On : November 11, 2024 1:08 pm

Sathya Sai District

Follow us on

Sathya Sai District: అమ్మను భారంగా భావించాడు ఓ ప్రబుద్ధుడు. మాయ మాటలు చెప్పి ఇంటి నుంచి బయటకు తెచ్చాడు. ఊరు కాని ఊరులో వదిలేసి పోయాడు. కేవలం తల్లి భారమవుతుందని భావించి ఈ దుశ్చర్యకు దిగాడు. సభ్య సమాజంలో తలదించుకునే పని చేశాడు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లిలో వెలుగు చూసింది ఈ ఘటన. శనివారం సాయంత్రం పెద్దమ్మ గుడి బస్టాండ్ వద్ద ఓ వృద్ధురాలిని ఒక వ్యక్తి బస్సు నుంచి దించాడు. ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే తన కుమారుడని.. భోజనం కోసం వెళ్ళాడని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు. కానీ గంటలు గడుస్తున్న కుమారుడు రాలేదు. రాత్రి అవుతున్నా ఆచూకీ లేదు. దీంతో ఆ వృద్ధురాలి దుస్థితిని తెలుసుకున్న స్థానిక యువకులు వసతి కల్పించారు. ఆమె దీనస్థితిని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో స్థానిక ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.

* వినికిడి లోపంతో బాధపడుతున్న వృద్ధురాలు
ఆ వృద్ధురాలు తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతోంది. ఏ విషయం చెప్పలేకపోతోంది. తనది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అని మాత్రమే చెబుతోంది. కుమారుల వివరాలు సైతం చెప్పలేక పోతుంది. దీంతో ఎస్సై ఆమె పరిస్థితిని చూసి బాధపడ్డారు. భోజనంతో పాటు కొంత మొత్తం డబ్బు కూడా ఇచ్చారు.ఆమె విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక సతమతమయ్యారు. వృద్ధురాలి ఆలనా పాలనచూసుకునేందుకు సిద్ధపడ్డారు.

* సోషల్ మీడియాలో స్పందించి
అయితే సోషల్ మీడియాలో సమాచారం అందుకున్న అమడగురు వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ జ్యోతి అక్కడకు చేరుకున్నారు. ఎస్సై తో మాట్లాడి ఆ వృద్ధురాలిని వృద్ధాశ్రమానికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు, పెనుగొండ జడ్జ్ బుజ్జప్ప తమ సహాయకుల ద్వారా వివరాలు ఆరా తీశారు.అయితే తల్లిని కుమారుడు నిర్దాక్షిణ్యంగా విడిచి పెట్టేసి వెళ్లిపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.