https://oktelugu.com/

BGT Ind Vs Aus: విరాట్ కాదు.. ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ కు టీమిండియా కెప్టెన్ అతడే!.. స్పష్టం చేసిన బీసీసీఐ..

తన భార్యకు డెలివరీ ఉన్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో నవంబర్ 22 నుంచి జరిగే పెర్త్ టెస్ట్ కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించినట్టు తెలుస్తోంది. దీంతో తదుపరి కాబోయే కెప్టెన్ ఎవరు అనే చర్చ నడుస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 11, 2024 1:01 pm

BGT Ind Vs Aus

Follow us on

BGT Ind Vs Aus: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం విరాట్ కోహ్లి ని పెర్త్ టెస్ట్ కు కెప్టెన్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ సత్యదూరాలని తర్వాత తేలింది. రోహిత్ పెర్త్ టెస్ట్ కు దూరమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో బుమ్రా కు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దిశగా బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. ” రోహిత్ గతంలోనే తన పరిస్థితిని మాకు వెల్లడించాడు. నవంబర్ మూడో వారంలో టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడుతుంది. దానికంటే ముందే రోహిత్ భార్య ప్రసవిస్తారు. ఆ సమయంలో రోహిత్ ఆయన భార్య పక్కన ఉండడం సమంజసం. అది అవసరం కూడా. అలాంటప్పుడు అతడు మాకు ముందే సమాచారం ఇచ్చాడు. బహుశా న్యూజిలాండ్ జట్టుతో మూడవ టెస్టు ముగిసిన తర్వాత మాకు ఈ విషయం చెప్పాడు. దీనిని మేము ఆమోదించాం. రోహిత్ స్థానంలో బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతడి స్థానంలో టీమిండియా పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఎంపికైంది.. రెండు విడతలుగా టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లిపోతారని” బిసిసిఐ ప్రకటించింది.

ఎలాగైనా గెలవాలని

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో టీమ్ ఇండియా ఓడిపోయింది. తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి వెళ్లాలంటే టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4-0 తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లే ఈ సిరీస్ టీమిండియా కు అత్యంత ముఖ్యంగా మారింది. ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ ఓడిపోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ పెద్దలు సమావేశమయ్యారు. ఓటమిపై అనేక రకాలుగా చర్చలు సాగించారు. గౌతమ్ గంభీర్ కు చివరి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్లో భారత్ గెలిస్తేనే ఆయనకు టెస్ట్ కోచ్ పదవి ఉంటుందని సమాచారం. లేనిపక్షంలో టెస్ట్ కోచ్ గా మరొక ఆటగాడిని నియమిస్తారని తెలుస్తోంది. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో భారత్ – ఏ జట్టు, ఆస్ట్రేలియా – ఏ తలపడ్డాయి. రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ లు ఆడాయి. ఇందులో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ లలో విజయం సాధించడం విశేషం. దీంతో ఆస్ట్రేలియా సానుకూల వాతావరణంలో సిరీస్ ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.. ఇదే సమయంలో టీమిండియా పై కాస్త ఒత్తిడి ఉంటుందని తెలుస్తోంది.