https://oktelugu.com/

CM Chandrababu: ఏపీ ప్రజలకు షాక్.. సంక్షేమ పథకాలు ఇప్పట్లో లేనట్టే.. చేతులెత్తేసిన చంద్రబాబు!

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు సమీపిస్తోంది. ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతోంది. కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : August 8, 2024 / 09:53 AM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. అంతులేని మెజారిటీతో గెలిచింది. కేవలం వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే టిడిపి కూటమికి విజయానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ పథకాలు. 2019 ఎన్నికల్లో జగన్ నవరత్నాలు మాదిరిగానే.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులను భారీగా పెంచారు. పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి గత రెండు నెలలుగా అందిస్తూ వచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. అన్న క్యాంటీన్లను తెరిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతకుమించి ఇంకా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయల సాయం, ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రైతులకు సాగు ప్రోత్సాహం కింద 20,000 చొప్పున నగదు సాయం.. ఇలా చాలావరకు పథకాలను ఇంకా అమలు చేయలేదు. ప్రజలు మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయి కానీ.. ఈ పథకాల అమలుపై కార్యాచరణ ప్రారంభం కాలేదు. దీంతో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.అసలు పథకాలు అమలు చేస్తారా? చేయరా? చేసే ఉద్దేశం ఉందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

    * ఆ ప్రకటనలతో అనుమానాలు
    ఇటీవల చంద్రబాబు వ్యవహార శైలితో పాటు ప్రకటనలు చూస్తుంటే పథకాల అమలుపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు సమీపిస్తోంది. అసెంబ్లీ లోపలా..బయట శ్వేత పత్రాల విడుదలతో వైసిపి వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టే పనిలో పడ్డారు. రాష్ట్రం దివాలా అంచున ఉందని.. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని.. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుందని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రజలను ముందుగానే అలెర్ట్ చేసి.. పథకాలు అమలు చేయలేనని.. ఒకవేళ అమలు చేసిన ఆంక్షలు ఉంటాయని సంకేతాలు పంపుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    * నవరత్నాలను అమలు చేసిన జగన్
    2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. చెప్పినట్టుగానే నవరత్నాలను అమలు చేసి చూపించారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించగలిగారు. కానీ చంద్రబాబు అంతకుమించి అనేసరికి ప్రజలు ఆయనకు ఈసారి ఛాన్స్ ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఆశించిన వారితో పాటు జగన్ హయాంలో అభివృద్ధి లేదని భావించిన వారు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. అందుకే టిడిపి కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే చంద్రబాబు తన మార్కు అభివృద్ధి వైపే దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు విషయంలో జాప్యం చేస్తున్నారు.

    * ఆదాయాన్ని పెంచి పంచుతానని చెప్పారుగా..
    రాష్ట్రంలో సంపద సృష్టించి ఆదాయం పెంచుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దానినే పేదలకు పంచుతానని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని కొత్త పల్లవి అందుకున్నారు. అయితే సంక్షేమ పథకాలు అందిస్తారని చెప్పడంతో.. ఎంతో నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా.. సీఎం చంద్రబాబు ప్రకటనలు చూస్తుంటే భిన్నంగా ఉన్నాయి. దీంతో ఒక్క రకమైన అయోమయ పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.