KCR And Jagan: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. కెసిఆర్, జగన్ ఒకేసారి అధికారానికి దూరం కాగా.. వారి వ్యక్తిగత ప్రత్యర్థులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు సీఎం అయ్యారు. దీంతో కెసిఆర్ తో పాటు జగన్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కానీ వారిద్దరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వారిద్దరి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. కానీ వారు మాత్రం వాడి వేడి ప్రకటనలు మాత్రం తగ్గించడం లేదు. త్వరలో ప్రభుత్వాలు పడిపోతాయని ప్రకటించడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల విపక్ష నేతలు ఒకేలా ప్రకటనలు చేస్తుండడం విశేషం. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేక తనపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అదే సమయంలో తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు నెరవేర్చలేక తమపై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే తరచూ వార్తలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు గమనిస్తే ఇట్టే తెలిసిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు ఒకే భావజాలంతో ఇన్ని రోజులు గడిపాయి. ఇప్పుడు ఒకేసారి అధికారం కోల్పోవడం, ఉమ్మడి శత్రువులు అధికారంలోకి రావడం వీరికి మింగుడు పడని విషయం. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఒకేలా రాజకీయాలు చేశారు కెసిఆర్,జగన్. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తరహా రాజకీయాలు కొనసాగిస్తుండడం విశేషం.
* బిజెపితో ఇద్దరిదీ ఒకటే శైలి
బిజెపితో వ్యవహరించే శైలిలో కూడా ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. బిజెపితో సంధి కోసం ఢిల్లీలో మకాం వేశారు కేటీఆర్, హరీష్ రావులు. అదే సమయంలో వైసీపీ తరఫున ఢిల్లీలో తిష్ట వేశారు విజయసాయిరెడ్డి. రాష్ట్రాల్లో మనుగడ కోసం ఆ రెండు పార్టీలు రాజ్యసభ సభ్యులను బిజెపికి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి.అందుకే బిజెపి పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
* బిజెపి అవసరం కీలకం
ఆ రెండు పార్టీలకు కేంద్రం అవసరం కీలకం. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కెసిఆర్ కుమార్తె కవిత చిక్కుకున్నారు. జైలు జీవితం కూడా అనుభవిస్తున్నారు. మరోవైపు జగన్ కు సైతం అక్రమాస్తుల కేసులు వెంటాడుతున్నాయి. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం తెరపైకి వస్తోంది. అందుకే అటు కెసిఆర్ కు, ఇటు జగన్ కు ఒకే తరహాలో కేంద్రం అవసరం ఏర్పడింది. కేంద్రంతో సఖ్యత కుదుర్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది.
* బిజెపితో చెలిమి
తెలంగాణలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి, ఏపీలో జగన్ కు చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిని టార్గెట్ చేసుకుంటున్నారు వారిద్దరు. అదే సమయంలో రాష్ట్ర బిజెపి నేతలు ఇద్దరు నేతల జోలికి పోవడం లేదు. హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయో.. ఇతరత్రా కారణాలు తెలియదు కానీ ఉభయ రాష్ట్రాల బీజేపీ నేతలు సైతం సైలెంట్ గా ఉన్నారు. దీంతో రకరకాల ఊహాగానాలకు కారణమవుతున్నారు. అయితే ఒకటి మాత్రం చెప్పగలం.. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారానికి దూరమైనప్పుడు కెసిఆర్, జగన్ ఒకే తరహా రాజకీయాలు నడుపుతుండడం మాత్రం ఆసక్తికరం.