Chiranjeevi And Balakrishna: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీకి నందమూరి బాలకృష్ణ అవకాశం ఇచ్చారా? లేకుంటే మెగాస్టార్ చిరంజీవి అప్పటి ఘటనపై క్లారిటీ ఇచ్చారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుందా? టిడిపి, జనసేన మధ్య విద్వేషం రెచ్చగొడుతోందా? కాపు, కమ్మ సామాజిక వర్గం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసెంబ్లీలో బాలకృష్ణ ప్రసంగంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కేవలం తన ప్రస్తావన తీసుకొచ్చినందుకు మాత్రమే తాను స్పందించినట్లు చెప్పారు. తన సినిమాలతో పాటు ఇతరుల సినిమాల టిక్కెట్లు విషయంలో కూడా తాను మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి స్పందించిన నాటి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నాలు చేసింది. సహజంగానే మెగా ఫ్యామిలీ, నందమూరి కుటుంబాల మధ్య సినీ ఆధిపత్యం అనేది సహజం. దశాబ్దాలుగా అభిమానులు విడిపోతూ వచ్చారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరిగింది. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేయడం.. చిరంజీవి స్పందించడంతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది.
* కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలతో..
వైసిపి ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగింది అన్నది బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్( Kamineni Srinivas ) చేసిన వ్యాఖ్య. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి లాంటి వారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి అవమానించారని.. అపాయింట్మెంట్ ఇచ్చి.. చాలా దూరం నడిపించారని.. ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడాలని సూచించారని.. టిక్కెట్ల ధర పెంపు కోసం అప్పట్లో చాలా అవమానించారని కామినేని అన్నారు. దీనిపై బాలకృష్ణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అప్పట్లో కాదు.. ఇప్పుడు కూడా తనకు అవమానం జరిగిందని చెప్పుకొచ్చారు. అంతే తప్ప మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన ప్రత్యేకంగా తీసుకురాలేదు.
* తాజాగా అవమానం జరిగిందని బాలకృష్ణ..
అసెంబ్లీలో బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి కలిసేందుకు తనను పిలిచారని.. తాను రానని చెప్పానని.. ఆ సైకోను కలవడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు బాలకృష్ణ. వెళ్లిన వారికి అవమానం జరిగిందని చెబుతూనే.. తనకు ఇటీవల ఫిలిం ఛాంబర్ వారు సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు పిలిచారని.. ఓ జాబితా తయారు చేశారని.. ఆ జాబితాలో తొమ్మిదో పేరుగా చేర్చి తనను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు బాలకృష్ణ. తాను ఇదే విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఫోన్ చేసి అడిగానని కూడా చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చేసరికి.. ఆయన స్పందించారు. అప్పట్లో సినీ పరిశ్రమకు అవసరమైన విన్నపాలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు నిర్ణయించామని.. అపాయింట్మెంట్ కోరితే.. కరోనా నిబంధనలతో కొద్దిమంది మాత్రమే రావాలని కోరారని.. అందుకే ఆ కొద్ది మందితో వెళ్లి కలిసామని క్లారిటీ ఇచ్చారు.
* చిరంజీవి స్పందనతో రంగంలోకి వైసిపి..
ఎప్పుడైతే చిరంజీవి( megastar Chiranjeevi) ఆ ప్రకటన చేశారో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది. అప్పట్లో చిరంజీవి చేతులు జోడిస్తూ జగన్మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను లీక్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది 2024 ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది. పవన్ కళ్యాణ్ సైతం దీనిని చాలా సందర్భాల్లో ఖండించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి గల మెగాస్టార్ చిరంజీవితో దండం పెట్టించుకున్న కుసంస్కారి జగన్ అంటూ చాలా సందర్భాల్లో డైరెక్ట్ గా మాట్లాడారు.. పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ మైత్రి ఉంటుందని ప్రకటన చేశారు. మరోవైపు కాపు, కమ్మ సామాజిక వర్గం రెండు కలిసి పని చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావాలి. రెండు కులాల మధ్య కుంపట్లు రేపాలి. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉంది. కానీ దీనికి విరుగుడుగా పవన్ కళ్యాణ్ చర్యలు తప్పకుండా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.