Chiranjeevi Counter Balakrishna: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ హయాంలో సినీ పరిశ్రమకు చాలా అవమానం జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దండం పెట్టించుకోవడం దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. సినీ పరిశ్రమలో అన్ని వర్గాలను కలచివేసాయి. అప్పట్లో మంత్రి కొడాలి నాని సినీ ప్రముఖులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. చిరంజీవి లాంటి వ్యక్తికి పకోడీ గాడు అంటూ వ్యాఖ్యానించిన సందర్భం కూడా ఉంది. అందుకే సినీ పరిశ్రమ యావత్ టిడిపి కూటమి గెలవాలని భావించింది. అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డితో అంటగాకిన సినీ ప్రముఖులు కొందరు సైలెంట్ గా ఉండిపోవాల్సి వచ్చింది. వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం ఉన్నా అందుకు తగ్గ పరిస్థితులు లేవు. అయితే టికెట్ల ధర పెంపు విషయములో సినీ పరిశ్రమకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపించిందన్నది బహిరంగ రహస్యం. కానీ కొంతమంది సినీ ప్రముఖులు తమ సొంత ప్రయోజనాల కోసం అప్పట్లో రాజీ పడ్డారు. అటువంటి వారే ఇప్పుడు నిప్పు రాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
* పవన్ వ్యాఖ్యానించినప్పుడు స్పందించలే..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan)ఒక వ్యూహంతో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలను చూశారు. తనను టార్గెట్ చేసుకొని సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టడాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అందుకే సినీ పరిశ్రమ విషయంలో చాలా రకాలుగా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే సినీ ప్రముఖులను పిలిచి అవమానించారు పవన్ కళ్యాణ్ కూడా తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా సీఎం స్థాయి వ్యక్తి అయిన చిరంజీవిని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఎన్నికల్లో కూడా దీనిపై ప్రచారం చేశారు. మెగాస్టార్ లాంటి వ్యక్తితో దండం పెట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. ఆయన అందరి మనిషిలా వస్తే అంత అవమానం చేస్తారా అని పవన్ నిలదీసిన సందర్భం కూడా ఉంది. అయితే పవన్ అలా వ్యాఖ్యానించినప్పుడు చిరంజీవి స్పందించలేదు. తనకు అవమానం జరగలేదని చెప్పలేదు. కానీ తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యానించేసరికి చిరంజీవి స్పందించారు. కానీ అది అవమానం గురించి కాదు. కేవలం సినీ పరిశ్రమ కోసమే ఆనాడు.. కరోనా నిబంధనలతో కొద్దిమందితో వెళ్లి కలవాల్సి వచ్చిందని మాత్రమే చెప్పుకొచ్చారు.
* టిడిపి తో పొత్తు వద్దని..
మెగాస్టార్ చిరంజీవిపై ( megastar Chiranjeevi)ఇతర ప్రముఖుల ప్రభావం ఉంది. 2024 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం మంచిది కాదని చిరంజీవి అభిప్రాయ పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వెనుక సినీ పరిశ్రమలో వైసిపి అనుకూలురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైతం చాలా రకాలుగా పనిచేసింది. కానీ పవన్ కళ్యాణ్ వాస్తవాన్ని గ్రహించారు. తెలుగుదేశం పార్టీతో పోత్తును కొనసాగించారు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు తో పాటు టిడిపిని నమ్మినట్టు చిరంజీవి, నాగబాబు నమ్మరని ఒక ప్రచారం ఉంది. దానికి కారణం లేకపోలేదు. నందమూరి కుటుంబాన్ని సినీ పరిశ్రమలో వ్యతిరేకించే కొన్ని ప్రముఖ కుటుంబాలు ఉన్నాయి. వారి ప్రభావం చిరంజీవి పై ఉంటుందన్నది సినీవర్గాల టాక్. అయితే పవన్ మాత్రం సినిమాలు వేరు, సినిమా రంగంలో స్టార్ డం వేరు.. రాష్ట్ర రాజకీయాలు వేరు.. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలి.. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అన్న ఆలోచనతోనే పవన్ టిడిపి తో జతకట్టేందుకు సిద్ధపడ్డారు. అయితే వైసిపి హయాంలో సినీ ప్రముఖుల అవమానంపై పవన్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ మెగాస్టార్ చిరంజీవి అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించేసరికి రకరకాల రచ్చ ప్రారంభం అయింది. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందో?