Srikakulam: ఆ వృద్ధుడు( old man) చనిపోయాడని భావించారు. బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. వారు సైతం చివరి చూపు కోసం వచ్చారు. అంత్యక్రియలకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది సేపట్లో స్మశానానికి తరలిద్దామనేలోగా ఎవరు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో ఆనందపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. జి. సిగడం మండలం సీతంపేట కు చెందిన ధర్మవరపు అప్పారావు అనే వృద్ధుడు అనారోగ్యం బారిన పడ్డాడు. 85 ఏళ్ల వయసు ఉన్న ఆయన వయోభారంతో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల కిందట ఆరోగ్యం క్షీణించడంతో అప్పారావును కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన శరీరం వైద్యానికి సహకరించడం లేదని చెప్పి వైద్యులు తిప్పి పంపారు. మరి కొన్ని గంటల్లో ఆయన చనిపోతారని కూడా చెప్పుకొచ్చారు.
* వైద్యులు నిర్ధారించడంతో
అయితే వెంటనే కుటుంబ సభ్యులు( family members) అంబులెన్స్ లో తీసుకుని సొంత గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఆయన ప్రాణం పోయింది. శ్వాస తీసుకోకపోవడంతో నిర్ధారణకు వచ్చారు. వెంటనే గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించడంతో వారు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్ ఇంటి సమీపంలోకి రాగానే అప్పారావును చూసి బంధువులు, స్థానికులు బోరున విలపించారు. అయితే మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్తారనగా.. అప్పారావు ఒక్కసారిగా కళ్ళు తెరిచి, కాళ్లు కదిలించాడు. కొద్దిసేపటికి ఆయన లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆనందం వ్యక్తం చేశారు.
* ఆ వయసులో యాక్టివ్ గా అప్పారావు( apparao)ఎనిమిది పదుల వయసులో సైతం చాలా యాక్టివ్ గా ఉండేవాడు. అయితే ఉన్నట్టుండి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదు. అయితే 8 పదుల వయసు దాటడంతో.. వయోభారంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు సైతం ఆశలు వదులుకున్నారు. వైద్యులు సైతం చనిపోతారని నిర్ధారించడంతో చాలా ఆందోళనకు గురయ్యారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ప్రాణాలతో కూర్చోవడం.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
* ఉత్తరప్రదేశ్ లో ఇలానే
అయితే దేశంలో ఎక్కడో చోట ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో( Uttar Pradesh) ఇదే మాదిరిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఓ యువకుడు లేచి కూర్చున్నాడు. ఉత్తరప్రదేశ్లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోయాడని భావించి పోస్టుమార్టం కోసం తీసుకెళ్తుంటే.. అతడు బతికే ఉన్నాడని గుర్తించి వెంటనే ఐసీయూకి తరలించి వైద్యం అందించారు. అంతేకాదు చనిపోయారు అనుకొని అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత కొందరు తిరిగివచ్చి.. కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి.