AP Pensions: నిన్న పింఛన్లు.. ఈరోజు జీతాలు.. ట్రాక్ లోకి ఏపీ

గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారు ఉద్యోగ, ఉపాధ్యాయులు. ఒక్కటంటే ఒక్క సమస్య కూడా వారిది పరిష్కారం కాలేదు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : July 2, 2024 9:48 am

AP Pensions

Follow us on

AP Pensions: ఏపీలో కూటమి అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. దాదాపు 55 శాతం మంది కూటమికి జై కొట్టారు. అందుకే తనకు అండగా నిలిచిన వారిని సంతృప్తి పరిచే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. నిరుద్యోగుల కోసం డీఎస్సీ నియామక ప్రక్రియకు పూనుకుంది. అలాగే జూలై 1న సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను శత శాతం పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చంద్రబాబు పింఛన్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం లో కార్యక్రమం సాగింది. మరోవైపు ఉద్యోగులు కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గత నాలుగు సంవత్సరాలుగా జగన్ సర్కార్ ఉద్యోగుల జీతభత్యాలను సక్రమంగా అందించలేకపోయింది. ఒకటో తేదీ బదులు నెలలో మూడో వారం వరకు జీతాలు అందించే పరిస్థితికి చేరుకుంది. గట్టిగా అడిగితే కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు సర్కార్ ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసి వారికి గుడ్ న్యూస్ అందించింది.

గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యారు ఉద్యోగ, ఉపాధ్యాయులు. ఒక్కటంటే ఒక్క సమస్య కూడా వారిది పరిష్కారం కాలేదు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అది కూడా చేయలేకపోయారు. ముందు ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు, సౌకర్యాలను సైతం నిలిపివేశారు. అడ్డగోలు నిర్ణయాలతో వారిని వేధించారు. పూటకో జీవోతో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు.చివరకు జీతాలు సైతం సక్రమంగా చెల్లించలేదు. అసలు వీరికి జీతాలు వేస్ట్ అన్నట్లు మంత్రులు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఆ రెండు వర్గాల్లో వైసీపీ పట్ల ఆగ్రహాన్ని నింపాయి. అందుకే వైసీపీని అధికారం నుంచి దూరం చేశారు. కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు.

గత నాలుగేళ్లలో తొలిసారిగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. దాదాపు అన్ని శాఖల ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమవుతూ వస్తోంది. గత నాలుగేళ్లలో ఒకటో తేదీన జీతాలు రావడం ఇదే తొలిసారి అని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జీతాలు అందుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకటో తేదీన జీతం వస్తుందన్న సంగతి మరిచిపోయామని.. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వ్యవస్థలో మార్పు వస్తోందని వారు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు సైతం ఒకటో తేదీన పెన్షన్ మొత్తం జమ అయ్యింది. వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరంపరను కొనసాగించాలని కోరుతున్నారు.