Dharmana PrasadhaRao :వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ మారతారన్న ప్రచారం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. గత కొద్దిరోజులుగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. కనీసం తనకు ఇష్టమైన వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి పెద్దగా బయటకు కనిపించడం లేదు. జగన్ ను కలిసి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇటీవల వరుసగా పార్టీ కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు. దీంతో ధర్మాన తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పెద్దల సభకు వెళ్లాలన్నది ధర్మాన ప్రసాదరావు టార్గెట్. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ధర్మాన.. చిన్న వయసులోనే మంత్రిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో కొనసాగారు. 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు. 2009లో సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలవడమే కాదు.. శ్రీకాకుళం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డారు. మరోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కానీ వైయస్సార్ అకాల మరణంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు.
* వైసీపీలో ఇమడలేక
వైసిపి ఆవిర్భావం తర్వాత కొద్దిరోజుల పాటు ఆ పార్టీలో చేరేందుకు ఇష్టపడలేదు. రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అచేతనంగా మారింది. దీంతో ధర్మాన ఆ పార్టీని వీడక తప్పలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ధర్మానకు ఓటమి ఎదురైంది. అయితే జగన్ విషయంలో ధర్మానకు చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అయినా సరే కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.2019 ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంతో పోటీ చేశారు ధర్మాన. ఆ ఎన్నికల్లో గెలిచేసరికి మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ను పరిగణలోకి తీసుకున్న జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కానీవిస్తరణలో కృష్ణదాస్ ను తప్పించి చివరి రెండు సంవత్సరాలు ప్రసాదరావుకు అవకాశం ఇచ్చారు.
* వైఎస్ఆర్ వద్ద ప్రాధాన్యం
అయితే రాజశేఖర్ రెడ్డి వద్ద ఉన్న ప్రాధాన్యం జగన్ వద్ద తనకు దక్కలేదన్నది ధర్మాన ప్రసాదరావు ఆవేదన. పేరుకే మంత్రి పదవి కానీ.. ఆయన రెండేళ్ల పాటు పెద్దగా యాక్టివ్ గా లేరు. ఈ ఎన్నికల్లో అయిష్టంగానే పోటీ చేశారు. కానీ ఓ సాధారణ సర్పంచి చేతిలో ఓటమి చవిచూశారు. శ్రీకాకుళం టిడిపి సంస్థాగతంగా బలమైన నియోజకవర్గం. అందుకే వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ధర్మాన భావిస్తున్నారు. ఆ పార్టీ కంటే టిడిపి మేలని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
* ఇక్కడ ఉండడం కష్టమే
ఉమ్మడి రాష్ట్రంలోనే ధర్మాన ప్రసాదరావు బలమైన బీసీ నేత. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహర్ నాయుడు కు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని అంచనాకు వస్తున్నారు. తనకు రాజ్యసభ తో పాటు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఎక్కడో ఒకచోట సర్దుబాటు చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి కూటమికి భారీగా రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. రాజ్యసభకు ధర్మాన ప్రసాదరావును పంపించడం ద్వారా బలమైన బీసీ వర్గాలకు.. సరైన సంకేతాలు పంపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తానికి అయితే ధర్మాన వ్యవహార శైలి చూస్తుంటే టిడిపి నుంచి భారీ ఆఫర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా సమీక్ష ఇటీవల జగన్ నిర్వహించారు. ధర్మాన ప్రసాదరావు హాజరు కాకపోవడంతో.. ఆయన మనసు మారిందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.