AP Politics: మరి కొన్ని గంటల్లో 2024 ముగియనుంది. కాలగర్భంలో కలిసిపోతుంది. కొత్త ఆశలతో 2025లో అడుగుపెట్టబోతున్నాం. అయితే అందరికీ మంచి జరగాలని ఆశిస్తారు. కానీ కొందరి విషయంలో కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తుంటాయి. ఈ 2025లో ఓ ముగ్గురు నేతలకు మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం అన్న ప్రచారం నడుస్తోంది. ఏపీలో రాజకీయ ప్రతీకారాలు నడుస్తున్న తరుణంలో.. ఓ ముగ్గురు నేతలు 2025లో అరెస్టు కావడం తధ్యమన్న ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ ముగ్గురు వ్యవహరించిన తీరుతో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఈ ముగ్గురిపై కేసుల నమోదు తో పాటు అరెస్టులు చేయాలన్న డిమాండ్ సగటు టిడిపి అభిమాని నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ అరెస్టును ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక రాయలసీమ రాజకీయాలను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం వదలకూడదని పార్టీ హై కమాండ్ కు డిమాండ్ చేస్తున్నారు.
* వారిపై కేసులు లేవు
టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. అయితే ఇలా ఫలితాలు వచ్చాయో లేదో కొడాలి నాని, వంశీ మోహన్ ఇళ్లపై టిడిపి శ్రేణులు దాడులు చేశాయి. చంద్రబాబు సీఎం కాగానే ముందుగా కొడాలి నాని, వంశి అరెస్ట్ అవుతారని అంతా ప్రచారం నడిచింది. కానీ ఏడు నెలలు అవుతున్నా వారు కనీసం పోలీస్ స్టేషన్ గడప కూడా ఎక్కలేదు. అదే సమయంలో వారిద్దరిపై విమర్శలు చేసే టిడిపి నేతలు కూడా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి అదే కారణం అవుతోంది. వారిద్దరిని ఎప్పుడు అరెస్టు చేస్తారా అని అడుగుతున్నారు పార్టీ శ్రేణులు.
* రాయలసీమలో పెద్దిరెడ్డి హవా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగడాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని శపధం చేశారు. కుప్పంలో పర్యటించడానికి కూడా అడ్డం పడ్డారు. చివరకు దాడులకు సైతం సిద్ధపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుక ఉండి నడిపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి నేతలు సైకిల్ పై తిరుపతి చేరుకునే క్రమంలో పుంగనూరులో అడుగు పెట్టారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాయలసీమనే తన కనుసైగతో శాసించారు పెద్దిరెడ్డి. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు ఆయన ఆగ్రహానికి గురయ్యాయి కూడా.
* అరెస్టులు తప్పవు
కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది. ఈ ముగ్గురు నేతల అరెస్టు జరగలేదు. 2025లో మాత్రం తప్పకుండా అరెస్టులు జరుగుతాయని టిడిపి శ్రేణులు ఆశతో ఉన్నాయి. అయితే ఇప్పటికే రెడ్ బుక్ లో ఉన్న వారిపై కేసులు నమోదవుతున్నాయని.. అందులో భాగంగానే వందలాదిమంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు, అరెస్టుల విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2024 ద్వితీయార్థంలో చిన్న నేతలపై.. 2025లో మాత్రం బడా నేతలపై చర్యలు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఆ ముగ్గురు నేతలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.