32 districts in AP: ఏపీలో( Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొత్త జిల్లాల పునర్విభజనకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కొత్త జిల్లాలో మార్పులు, చేర్పులకు కసరత్తు ప్రారంభం అయినట్లు సమాచారం. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు, ఉన్న జిల్లాలో మార్పులపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటైన సంగతి తెలిసిందే. మరోవైపు డివిజన్ల మార్పు, మండలాల పైన సూత్రప్రాయంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొన్ని నియోజకవర్గాలు తిరిగి పాత జిల్లాల్లో కలవనున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఒకవైపు మంత్రుల ఉప సంఘం జిల్లాల్లో పర్యటించి వినతులు స్వీకరించింది. ఇంకోవైపు ఆయా జిల్లా కలెక్టర్లు సైతం వినతులు స్వీకరించారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, రెవిన్యూ డివిజన్లో మార్పు, మండలాలపై జనవరిలో అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం వెల్లడించి అవకాశం కనిపిస్తోంది.
హేతుబద్ధత లేకుండా విభజన..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో ఉమ్మడి 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలుగా మార్చారు. అయితే జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత పాటించలేదన్న విమర్శ ఉంది. అందుకే తాము అధికారంలోకి వస్తే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. అయితే ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ తమ నివేదికను అందించాల్సి ఉంది. కానీ ప్రజాభిప్రాయ సేకరణలో జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మంత్రుల కమిటీ నుంచి నివేదిక తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయని తెలుస్తోంది. ప్రధానంగా ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, గూడూరు, మదనపల్లి, రాజంపేటలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒక ట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు సైతం ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు కూడా జరిగే అవకాశం ఉంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఖరారు చేసే పరిస్థితి ఉంది. ఏదైనా మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి.
అనేక ఆరోపణలు, విమర్శలు
అయితే కొన్ని నియోజకవర్గాలు తిరిగి యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. తమను అనవసరంగా కొత్త జిల్లాల్లో చేర్చారని అక్కడి ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు సుదూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. వ్యయ ప్రయాసలకు ఓర్చి తాము డివిజన్ కేంద్రానికి చేరుకోవాల్సి వస్తుందని చాలామంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి తీర్మానాలు కూడా చేశాయి. తమను అదే జిల్లాలో కొనసాగించాలని కొందరు.. అదే డివిజన్లో కొనసాగించాలని మరికొందరు.. కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని ఇంకొందరు ఇలా ఎన్నెన్నో డిమాండ్లు తెరపైకి వచ్చాయి. అయితే వీటి విషయంలో ఎంత మాత్రం తాత్సారం చేయకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో కొత్త జిల్లాల ఏర్పాటు పై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.