AP Politics: రాజకీయాలకు ఈ ఏడాది కీలకం. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసిపి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాయి.ఈ రెండు ప్రభుత్వాలకు మరో మూడు నెలల కాలవ్యవధి మాత్రమే ఉంది. నిన్నటికి నిన్న ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. అప్పుడే ఐదేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చే కొట్టాలని మోడీ భావిస్తున్నారు. ఏపీలో తన మార్కు రాజకీయంతో రెండోసారిఅధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కానీ అభివృద్ధి, ఇతరత్రా అంశాల్లో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయారన్న విమర్శ ఉంది. కరోనా సమయంలో నగదు బదిలీ పథకాలతో ఆకట్టుకున్నారు. అదే సమయంలో పాలనా వైఫల్యాలను మూట కట్టుకున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో సానుకూల తీర్పు వస్తుందని మాత్రం బలంగా నమ్ముతున్నారు. ఒంటరి పోరుకు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పూర్తి పెట్టుకుంది. బిజెపితో పొత్తు విషయం తేలలేదు. మరోవైపు బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కర్ణాటక తో పాటు తెలంగాణలో అధికారంలోకి రావడం ఆ పార్టీకి సానుకూల అంశం. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలను ఏపీ కాంగ్రెస్ సారధిగా నియమించేందుకు హై కమాండ్ దాదాపు సిద్ధపడింది. ఇది కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశమే.
ఏపీ సీఎం జగన్ అంటే విపక్షాలకు పడడం లేదు. చంద్రబాబు, పవన్ లతో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం జగన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా గద్దె దించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలది అదే భావనగా ఉంది. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారా? అన్నది చూడాలి. ఈ ఏడాది రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయం పైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. జగన్ వైసీపీ అభ్యర్థులను భారీగా మార్చుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని.. తనపై అంతకంటే లేదని.. ఉంటే గింటే ఎమ్మెల్యేలు, మంత్రులపైనే ఉందని చెబుతున్నారు. అందుకే అభ్యర్థులను మార్చుతున్నారు. ఇంత మార్చినా ఓటమి ఎదురైతే మాత్రం అది తన వైఫల్యంగానే ఒప్పుకోవాల్సిన పరిస్థితి జగన్ పై ఉంటుంది.
ఈ ఎన్నికల్లో విజయం చంద్రబాబుకు కీలకం. వయసు రీత్యా చంద్రబాబు ఈ ఎన్నికల్లో మాత్రమే యాక్టివ్ గా ఉండగలరు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల నాటికి 80 సంవత్సరాలకు చేరువవుతారు. ఆ వయసులో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం కష్టం. అటు జనసేనకు సైతం గెలుపు ముఖ్యం. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్న సరైన విజయం దక్కలేదు. ఇప్పుడు పొత్తుల ద్వారా ఆ కలను సాకారం చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. గెలిస్తేనే జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే మాత్రం ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మిగిలింది. అందుకే 2024 ఏడాది రాజకీయంగా ఏపీకి కీలకమైంది. ఏపీ భవిష్యత్తు ఎలా ఉండటంతో తేల్చడానికి కాలం సిద్ధంగా ఉంది. మరి ప్రజల తీర్పు ఎలా ఉందో? ఎలా ఉంటుందో? చూడాలి మరి.