https://oktelugu.com/

AP Government: మత్స్యకారులకు రూ.20 వేలు భృతి అప్పుడే.. ఆ రెండు పథకాలు ఫిక్స్!

సంక్షేమ పథకాలు అమలుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందుకు సంబంధించి సమయాలను కూడా ప్రకటించింది.

Written By: , Updated On : February 17, 2025 / 10:53 AM IST
AP Government (1)

AP Government (1)

Follow us on

AP Government: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు తేదీలను ప్రకటించింది. రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు సంబంధించి పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మత్స్యకార భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ప్రధాన సంక్షేమ పథకాలు ఏవి ప్రారంభం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ పథకాలు ప్రారంభం కానున్నాయి.

* వేట నిషేధ భృతి
ఏటా ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం. ఆ సమయంలో మత్స్యకారులు( fisheries) తీరానికి పరిమితం అవుతారు. సముద్రంలో చేపల ఉత్పత్తి చేసే సమయం అది. ఆ సమయానికి గాను ప్రభుత్వం మత్స్యకారులకు భృతి అందిస్తూ వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మత్స్యకార భరోసా పేరిట సాయం చేస్తూ వచ్చింది. అయితే తాము అధికారంలోకి వస్తే అర్హుడైన మత్స్యకారుడికి చేపల వేట నిషేధ సమయానికి భృతి కింద.. 20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏప్రిల్ 15 నుంచి చేపల వేట నిషేధం ఉండడంతో.. అదే నెలలో మత్స్యకార భరోసా అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చేపల వేట నిషేధ ప్రారంభం సమయానికి మత్స్యకారుల ఖాతాలో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

* అన్నదాత సుఖీభవ
అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకాన్ని మేలో అమలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరిట ఈ పథకాన్ని అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రూ.6000 అందించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 అందిస్తూ వచ్చింది. అయితే తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20వేల రూపాయలు మొత్తాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ మే నెలలో అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టునుంది కూటమి సర్కార్. అయితే కేంద్రం అందించే పీఎం కిసాన్ మాదిరిగా మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

* తల్లికి వందనం పథకం
మరోవైపు జూన్లో తల్లికి వందనం( thalliki Vandanam ) పేరిట సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరుతో పథకం అమలు జరిగేది. అయితే ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే సాయం అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15 వేల రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పేరిట పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.

* కోడ్ ముగిసిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్( election code) ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది. దీంతో చాలా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలోనే డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కు జాప్యం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి అయితే మరో మూడు నెలల్లో కీలకమైన మూడు పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడం విశేషం.