Kesineni Nani: కేశినేని నాని( Kesineni Nani ) పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? తెలుగుదేశం పార్టీలో చేరతారా? లేకుంటే వైసీపీలోనే కొనసాగుతారా? మరో ప్రత్యామ్నాయ పార్టీ చూసుకున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాని. కానీ భారీ ఓటమి ఎదురయింది. దీంతో తీవ్ర మనస్తాపంతో రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు అనుచరులను తరచూ కలుస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బరిలో దిగుతానని అనుచరుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. దీంతో కేశినేని నాని రీఎంట్రీ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
* టిడిపి నాయకత్వంతో విభేదాలు విజయవాడ( Vijayawada) పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు నాని. 2014లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం తట్టుకొని నిలబడ్డారు. శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని విజయం సాధించారు. అయితే కేశినేని నాని పార్టీ నేతలకు విభేదించడం ప్రారంభించారు. నాయకత్వంతో సైతం విభేదించడం ప్రారంభించారు. ముఖ్యంగా లోకేష్ నాయకత్వానికి ఎదురు తిరిగారు. కేశినేని నాని వ్యవహార శైలిని గమనించిన టిడిపి నాయకత్వం ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహించడం ప్రారంభించింది. దీనిని తట్టుకోలేక పోయారు కేశినేని నాని. ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ సోదరుడు శివనాథ్ అలియాస్ చిన్ని చేతిలో ఓడిపోయారు నాని. మనస్థాపానికి గురై ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
* నియోజకవర్గంలో పర్యటనలు
అయితే ఇటీవల పరిణామాలతో కేశినేని నాని( Kesineni Nani ) తిరిగి యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. పాత మిత్రులను కలుస్తున్నారు. మరోసారి బరిలో దిగుతానని వారితో చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఆయనకు తలుపులు మూసుకుపోయాయి. చివరి నిమిషంలో పార్టీని ఇరుకునపెట్టి ఆయన వైసీపీలో చేరడంతో.. టిడిపి శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రెండుసార్లు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుండి ప్రాతినిధ్యం వహించడంతో.. ఆయనకు టిడిపి క్యాడర్ తో మంచి అనుబంధం ఉంది. అయితే చంద్రబాబు వరకు ఓకే కానీ.. లోకేష్ మాత్రం నానిని పార్టీలోకి చేర్చే అవకాశమే లేదని తెలుస్తోంది.
* బిజెపికి దగ్గరగా
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాని బిజెపిలో( Bhartiya Janata Party) చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వాస్తవానికి టిడిపికి రాజీనామా చేసి కేశినేని నాని బిజెపిలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఎందుకంటే బిజెపి అగ్రనేతలతో నానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నితిన్ గడ్కరి, రాజ్ నాథ్ సింగ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు నాని. ఇప్పటికే వారితో చర్చలు జరిపారని.. అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం బిజెపిలోకి నానిని తీసుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అతి త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన కేశినేని నాని.. కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.