https://oktelugu.com/

Ongole : పక్క వీధిలో నిర్బంధానికి గురైన బాలిక ఆచూకీకి 15 రోజులు.. ఏపీ పోలీస్ శాఖ తీరు భేష్

బాధితులు నిరుపేదలు కావడం వల్లే సత్వర న్యాయం పొందలేకపోయారని.. ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరుకు ఇది ఆదర్శమంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : July 5, 2023 / 08:34 PM IST
    Follow us on

    Ongole : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ఏపీలో వ్యవస్థల తీరు. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖ తీరు దయనీయంగా మారింది. బాధిత వర్గాల ఆర్థిక స్థితిని బట్టి పోలీసు కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఓ బాలిక లైంగిక వేధింపులకు గురై పక్క వీధిలో ఆగంతకుడి చెరలో ఉన్నా పట్టుకోలేని స్థితిలో పోలీసులు ఉండడం గమనార్హం. స్వయంగా బాలికే కుటుంబసభ్యులతో వచ్చి చెప్పేదాక తెలుసుకోలేని స్థితిలో మన రక్షక భటులు ఉండడం విమర్శలకు తావిస్తోంది.

    ఒంగోలు బిలాల్ నగర్ కు చెందిన మైనర్ బాలిక జూన్ 15న అదృశ్యమైంది. ఆమె సోదరుడు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బైక్ పై తీసుకెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదుచేస్తున్నట్టు పోలీసులు వారికి తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే జూన్ 30న అదే బాలిక కుటుంబసభ్యులతో పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తనను ఖలీల్ అనే యువకుడు నిర్బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదుచేశారు.

    అయితే దర్యాప్తులో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. బైక్ పై గుర్తుతెలియని వ్యక్తి తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్న ఆ దిశగా దర్యాప్తు చేయలేకపోయారు. పక్క వీధి వ్యక్తి, అందునా 100 మీటర్ల దూరంలోనే నిర్బంధించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. పైగా ఆమె సమ్మతితోనే సదరు వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పుకొస్తున్నారు. ఆమె మేజర్ అయితే పర్వాలేదు. కానీ ఆమె మైనర్ కావడంతో ఎలా తీసుకెళ్లినా అది నేరమే అవుతుంది. కానీ అది నేరమే కానట్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది.

    బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయడం వాస్తవం. ఆయన చెప్పిన అనుమానాలు, ఆనవాళ్లు పరిగణలోకి తీసుకుంటే రోజుల వ్యవధిలోనే కేసు ఛేదన సాధ్యం. కానీ ఏకంగా 15 రోజుల తరువాత బాధితురాలే స్వయంగా వచ్చి చెప్పిన తరువాత నిందితుడ్ని గుర్తించడం చూస్తుంటే పోలీస్ శాఖ పనితీరు ఇట్టే అర్థమైపోతోంది. బాధితులు నిరుపేదలు కావడం వల్లే సత్వర న్యాయం పొందలేకపోయారని.. ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరుకు ఇది ఆదర్శమంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.