Tirumala : పెంపుడు జంతువుతో తిరుమల కొండపైకి రావచ్చా? పెట్ డాగ్ తో కొండపైకి వచ్చిన ఫ్యామిలీ ఏమైందో తెలుసా?

టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారమందడంతో వారు హుటాహుటిన కొండపైకి చేరుకున్నారు. కర్నాటక భక్తుల టెంపో గురించి ఆరాతీయడం ప్రారంభించారు. నంబరు ఆధారంగా ఓ చోట టెంపో పార్కింగ్ చేయడాన్ని గుర్తించారు. కుక్కతో సహా వాహనాన్ని కొండపై నుంచి కిందకు పంపించారు.

Written By: Dharma, Updated On : July 5, 2023 8:19 pm
Follow us on

Tirumala :  తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బందికి పెంపుడు కుక్క ముప్పుతిప్పలు పెట్టింది. దర్జాగా టెంపో వాహనంలో ఎక్కి తిరుమల కొండపై ఎంచక్కా తిరిగేసింది. తిరుమల కొండపై జంతువులకు ప్రవేశం లేదు. ఈ విషయం తెలియని కర్నాటకు చెందిన భక్తులు తమ పెంపుడు కుక్కను తీసుకొచ్చారు. టెంపో వాహనంలో చిక్కుకుపోయిన కుక్క అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది కంట్లో పడలేదు. దీంతో ఏకంగా కొండపైకి టెంపో చేరుకుంది. దానిని నుంచి భక్తులతో శునకం కూడా ల్యాండ్ అయ్యింది.

కొండపై రామ్ భగీచా బస్టాండ్ వద్ద ఆ కుక్క ఎంచక్కా అటు ఇటు చక్కెర్లు కొట్టింది. మీడియా కంటపడింది. అదేంటీ కొండపైకి కుక్క వచ్చిందంటూ  అక్కడున్న భక్తులు సైతం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయ్యింది. టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారమందడంతో వారు హుటాహుటిన కొండపైకి చేరుకున్నారు. కర్నాటక భక్తుల టెంపో గురించి ఆరాతీయడం ప్రారంభించారు. నంబరు ఆధారంగా ఓ చోట టెంపో పార్కింగ్ చేయడాన్ని గుర్తించారు. కుక్కతో సహా వాహనాన్ని కొండపై నుంచి కిందకు పంపించారు.

తిరుమలలోకి జంతువుల ప్రవేశం నిషిద్ధమని చాలామందికి తెలియదు. అందుకే దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఇళ్లకు తాళాలు వేసి పెంపుడు జంతువులను తెస్తుంటారు. ఇలా తెచ్చే క్రమంలో అలిపిరి చెక్ పోస్టు వద్ద అడ్డుకుంటారు. అటువంటి సమయంలో భక్తుల బాధలు వర్ణనాతీతం. అయితే కర్నాటక నుంచి వచ్చిన టెంపోలో కుక్క ఉన్నట్టు చెక్ పోస్టు సిబ్బంది గుర్తించలేదు. అటు భక్తులు సైతం తమతో కుక్క ఉన్నట్టు చెప్పలేదు. కొండపై కుక్క కనిపించడం, క్షణాల్లో అది వైరల్ కావడం జరిగిపోయింది. అయితే టీటీడీ భద్రత విభాగంతో పాటు విజిలెన్స్ పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.