కరోనా కారణంగా ఈసారి విద్యాసంవత్సరం గందరగోళంలో పడింది. అందులోనూ.. ఏపీలో అయితే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం అప్పటికే ప్రకటించిన టెన్త్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించేందుకు పంతానికి పోయింది. కానీ.. కరోనా విజృంభించడంతో చివరికి పరీక్షలను రద్దు చేసి అందరినీ పాస్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే.. విద్యార్థులకు కేవలం పాస్ అన్నట్లుగానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అంటే.. అందరూ ఒకటే కేటగిరి కిందకు తీసుకొచ్చారు. ఏడాది అంతా కష్టపడిన వాళ్లకు అదే ‘పాస్’.. గాల్లో దీపం చదువులు చదివిన వారికీ అదే ‘పాస్’ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పటికైతే ఆ సర్టిఫికెట్ బాగానే ఉంటుంది కానీ.. భవిష్యత్‌లో మాత్రం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.
కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు మంచిగానే చేశాయి. విద్యార్థులకు అన్యాయం జరగకుండానే చూశాయి. టెన్త్ విద్యార్థుల మధ్యంతర పరీక్షలు.. ప్రీ ఫైనల్ పరీక్షలు వంటి వాటిల్లో సాధించిన మార్కుల ఆధారంగా వారకి గ్రేడింగ్ ఇచ్చారు. కష్టపడిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూసుకున్నారు. కానీ.. ఏపీలో మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయలేదు. హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారంగా ఇక్కడా ఇవ్వాలని కోరినా అక్కడి విద్యాశాఖ పెద్దగా పట్టించుకోలేదు.
ఫ్యూచర్‌లో ఏ జాబ్ కోసమైనా టెన్త్ మెమో ఆధారాన్ని చేస్తుంటారు. కనీసం 60 శాతం మార్కులు ఉంటేనే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇంపార్టెన్స్ ఇస్తాయి. తక్కువ మార్కులు వచ్చిన వారిని.. జస్ట్ పాస్ అయిన వారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలోని టెన్త్ విద్యార్థులకు జారీ చేస్తున్న పాస్ సర్టిఫికెట్లతో ఫ్యూచర్‌లో తీవ్రంగా నష్టపోతారని విద్యారంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఓపెన్ స్కూల్స్ విధానంలో నిర్వహించాల్సిన టెన్త్ పబ్లిక్ పరీక్షలనూ రద్దు చేసింది. వారికి మాత్రం పాస్ సర్టిఫికెట్లు కాకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నారు. కొంత మందికి సాధారణంగా పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేసి.. కొంత మందికే గ్రేడ్లు ఇవ్వడం ఏమిటన్న అసహనం విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ కనిపిస్తోంది.