Arulvaan Rivew: మనం ఒక సినిమా చూస్తాం.. థియేటర్ నుంచి బయటికి వస్తాం. ఆ తర్వాత ఆ సినిమా గురించి మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మనతోపాటు బయటికి వచ్చేస్తుంటాయి. మనల్ని అనేక సందర్భాలలో వెంటాడుతుంటాయి. మన గుండె చప్పుడును మరింత బలోపేతం చేస్తుంటాయి. కన్నీటి చెమ్మను రగిలిస్తుంటాయి. మన ఆలోచనలలో అనునిత్యం తిరుగుతూనే ఉంటాయి. అటువంటి సినిమానే అరుల్వాన్. పేరుకు ఇది తమిళ సినిమా అయినప్పటికీ.. ఆ చిత్రంలో సన్నివేశాలు.. దృశ్యాలు.. మాటలు.. ఇలా ప్రతిదీ మనతోపాటు వస్తుంది. మన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. మనం మనుషులం అనే విషయాన్ని కళ్ళముందు కనిపించేలా చేస్తుంది.
ఈ సినిమాకు గణేష్ వినాయక దర్శకుడు. చదువు అనే అంశాన్ని కేంద్రంగా తీసుకొని ఈ సినిమాని రూపొందించారు. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామానికి చెందిన చిన్నారి కురింజి చదువుకోవాలని అనుకుంటుంది. కానీ ఆమెకు స్కూలుకు వెళ్లే అవకాశం ఉండదు. అక్కడ కనీసం సదుపాయాలు కూడా ఉండవు. బయటి ప్రపంచంతో సంబంధాలు ఏమాత్రం ఉండదు. ఈ నేపథ్యంలో తనకు మాత్రమే కాదు.. గ్రామంలో ఉన్న ప్రతి చిన్నారికి చదువు అందాలని ఆమె చేసే ప్రయాణమే ఈ సినిమా కథ
ఈ సినిమా ప్రారంభంలో కురింజి ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తారు. కొండలు, గిరిజనుల జీవన విధానం, వారి ఆచారాలు.. అమాయకత్వం చూస్తుంటే మనకు మరొక లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కాంక్రీట్ జంగిల్ లో మనం ఏం మిస్ అవుతున్నామో అర్థమవుతుంది. కదా అనుకున్నంత వేగంగా సాగదు. అలాగని మనల్ని బోర్ కొట్టనివ్వదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ప్రపంచంలోకి మనం నెమ్మదిగా వెళ్లిపోతుంటాం. అయితే ఇక్కడే సినిమాకు బలం ఉంది. బలహీనత కూడా ఉంది. దర్శకుడు చెప్పాలి అనుకున్న విషయం బలంగానే ఉండవచ్చు. కానీ ఆ విషయాన్ని ప్రేక్షకులకు చేరవేసే క్రమంలో తడబడ్డాడు. కొన్ని సన్నివేశాల నుంచి భావోద్వేగాన్ని రాబట్టడానికి లాగ్ చేసినట్లు అనిపిస్తుంది.
ఇక ఈ సినిమాకు అసలు బలం బేబీ కృతిక. కురింజి అనే పాత్రలో ఆమె జీవించింది. ఆమె సహజమైన నటన సినిమాకు భావోద్వేగమైన బలాన్ని ఇస్తుంది. ఆమె కళ్ళల్లో కనిపించే అమాయకత్వం.. చదువుకోవాలి అనే పట్టుదల.. తన గ్రామంలోని పిల్లల కోసం ఆమె తీసుకునే నిర్ణయాలు.. ఇవన్నీ కూడా కథను ప్రేక్షకుడికి అత్యంత దగ్గర చేస్తాయి. ఇక ఇప్పటివరకు ఎక్కువగా త్రిల్లర్.. డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన అరుల్ నిధి ఈ సినిమాలో కలెక్టర్ ముత్తు వేల్ పాత్రలో కనిపిస్తారు. ఈయన పాత్ర సినిమాలోకి వచ్చిన తర్వాత కథ వేరే విధంగా మారిపోతుంది. ఆయన కురింజి కలను అర్థం చేసుకున్న తర్వాత. ఆమెకు అండగా నిలిచే అధికారి పాత్రలో అరుల్ నిధి కనిపిస్తారు. ఈయన ప్రశాంతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే హీరో పాత్ర సంబంధించిన స్క్రీన్ టైం తక్కువగా ఉండడంతో అరుల్ నిధి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉండొచ్చు.
ఈ సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫీ. ప్రకృతి అందాలను అద్భుతంగా బంధించి ఈ సినిమాకు తిరుగులేని స్థాయిని అందించారు. వాస్తవానికి అందమైన దృశ్యాలను సినిమాకు బ్యాక్ డ్రాప్ లాగా వాడుకుంటారు. కానీ ఈ సినిమాలో ప్రకృతి ఒక పాత్రలాగా ఉంటుంది. విజువల్ ట్రీట్ అభిమానులకు కన్నుల పండుగలాగా ఉంటుంది.
జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం.. నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలకు మాత్రం నేపద్య సంగీతం మరీ సూటిగా ఉన్నట్టు కనిపిస్తుంది.
ఈ సినిమాకు ప్రధాన లోపం ఒకటి ఉంది. చెప్పాలి అనుకున్నది సందేశం మంచిదే. కాకపోతే దానిని ప్రేక్షకుడిపై బలంగా మోపుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు నాచురల్ గా కాకుండా, కేవలం సందేశాలను చెప్పడానికి మాత్రమే రూపొందించినట్లు కనిపిస్తాయి. అందువల్లే ఈ సినిమా గొప్పగా ఉందని పూర్తిగా చెప్పలేని పరిస్థితి. మేకింగ్.. కథనం విషయంలో కూడా ప్రేక్షకుడు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు.. ఈ సినిమా పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు. కానీ చెప్పాలి అనుకున్న విషయం మాత్రం చాలా అవసరమైనది. నేటి కాలంలో విద్య అనేది ఒక లగ్జరీ కాదు. సౌకర్యం అంతకంటే కాదు. ప్రతి బిడ్డ హక్కు.. అనే ఆలోచనను ఈ సినిమా ముందుకు తీసుకొస్తుంది. చిన్నారి కృతిక నటన.. అరుల్ నిధి పాత్ర.. కొండప్రాంతాల విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఒకవేళ కథనం గనుక బిగుతుగా ఉండి ఉంటే.. భావోద్వేగాలను సహజంగా పలికించి ఉంటే కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్దగా ఉండేది.
సూటిగా ఒక ముక్కలో చెప్పాలంటే కథలో నిజాయితీ ఉంది. చూపించే విధానంలో మాత్రం లోపాలు కనిపించాయి. సినిమా పూర్తి అయిన తర్వాత ప్రతి చిన్నారికి చదువు అనేది దక్కాలి అని ఆలోచనతో మనం బయటికి వస్తాం. ఈ విషయంలో దర్శకుడికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు.