Hardik Pandya: ఎంతటి పెద్ద మొక్క అయినా సరే నాటేటప్పుడు ఒక కర్రను ఊతం పెట్టాలి. ఎందుకంటే గాలి వీచినప్పుడు మొక్కను విరిగిపోకుండా ఊతం కాపాడుతుంది. మొక్క వేర్లు భూమిలోకి బలంగా దిగిన తర్వాత ఊతం అవసరమనేది అంతగా ఉండదు. ఈ మొక్క, ఊతం ఫ్యాక్టర్ క్రికెట్ కి కూడా వర్తిస్తుంది.
క్రికెట్ లో దేశవాళి టోర్నీలలో ప్లేయర్లు ఆడిన తర్వాత.. వాటి ద్వారా విపరీతమైన అనుభవం సంపాదించిన తర్వాత.. వివిధ వేదికల మీద వారు తడబాటుకు గురికారు.. పరుగులు సాధించడంలో.. వికెట్లు పడగొట్టడంలో నేర్పరితనాన్ని ప్రదర్శిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఆట తీరును కనబరుస్తుంటారు. అందువల్లే ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ ఉండాలి అంటారు. డొమెస్టిక్ క్రికెట్లో ఆటగాళ్లకు విపరీతమైన సాధన లభిస్తుంది. నెట్స్ లో చేసే సాధనకంటే.. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం వల్ల విపరీతమైన ప్రాక్టీస్ లభిస్తుంది. డొమెస్టిక్ క్రికెట్ సరిగా ఆడకపోవడం వల్లే ఇటీవల టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి పాలయింది.
టీమిండియా కు అచ్చి వచ్చిన పొట్టి ఫార్మాట్ ప్రస్తుతము ఆడుతోంది. దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా 5 t20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుపై ఏకపక్ష విజయాన్ని సాధించింది.. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. కటక్ మైదానంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. వాస్తవానికి ఈ మైదానంలో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా తో ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా ఓటమిపాలైంది. అయితే ఈసారి మాత్రం సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది.
భారత జట్టు టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసింది. 78 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వచ్చాడు హార్థిక్ పాండ్యా.. ప్రారంభం నుంచి చివరి వరకు వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. 28 బంతులు మాత్రమే ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. ఈ టోర్నీ కంటే ముందు హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.. ఆ తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. అందులో తన సత్తా చూపించాడు. తద్వారా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన టి20 సిరీస్ కు ఎంపికయ్యాడు. తన పునరాగమనం ఎంత గొప్పగా ఉందో తొలి మ్యాచ్ ద్వారా నిరూపించాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడితే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో నిరూపించాడు. ఉన్న పేరు ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయకూడదని.. డొమెస్టిక్ క్రికెట్ లో వారు ఆడుతున్న తీరును బట్టి జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ కు చెప్పకనే చెప్పాడు హార్థిక్ పాండ్యా.