World Kiss Day: ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, విశ్వాసం వంటి భావాలను మాటలకంటే అందమైన స్పర్శ ద్వారా వ్యక్తపరిస్తే ఆ వ్యక్తుల మద్య ప్రేమ మరింత బలపడుతుంది. అయితే ఈ స్పర్శ ముద్దు(Kiss)ద్వారా ఉంటే అత్యంత సహజమైన భావోద్వేగ వ్యక్తీకరణగా దీనిని భావిస్తారు. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భాగస్వాముల మధ్య అందమైన స్పర్శ అనేది చాలా అవసరం. ఈ అనుబంధానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ కిస్ డే (World Kiss Day) ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ కిస్ డేను ఎప్పుుడ ప్రారంభించారు? ఈరోజు ఏం చేస్తారు?
ప్రపంచ కిస్ డే ఎలా ప్రారంభమైంది?
ప్రపంచ కిస్ డేకు 1990ల చివర్లో బ్రిటన్‌లో బీజం పడింది. 2000 సంవత్సరం నుంచి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఖరీదైన బహుమతులు, ఆర్భాటాల కంటే ప్రేమను నిజాయితీగా వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. జీవిత భాగస్వాములు, ప్రేమికులు మాత్రమే కాదు.. తల్లిదండ్రులు-పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలకు ముద్దు ఒక ప్రతీకగా నిలుస్తుంది.
1. ముద్దుతో క్యాలరీలు కూడా ఖర్చవుతాయా?
నిపుణుల అంచనా ప్రకారం.. ఒక నిమిషం పాటు ఇచ్చే ముద్దు ద్వారా సుమారు 2 నుంచి 6 క్యాలరీలు వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇది వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాకపోయినా, శరీరంలోని కొన్ని కండరాలు చురుకుగా పనిచేయడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ముఖంలోని అనేక కండరాలు ఒకేసారి కదలడం వల్ల వాటికి సహజమైన వ్యాయామం లభిస్తుంది.
2. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి “హ్యాపీ హార్మోన్లు” విడుదలవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు సంతోష భావన పెరుగుతుంది. ఆందోళన, టెన్షన్ తగ్గి భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
3.గుండె ఆరోగ్యానికి కూడా మేలు
ప్రేమతో ఇచ్చే ముద్దు వల్ల గుండె వేగం కొద్దిగా పెరగడంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తపోటు (BP) నియంత్రణకు కూడా కొంతవరకు సహాయపడే అవకాశం ఉంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.
4.ముఖ కండరాలకు సహజ వ్యాయామం
ముద్దు పెట్టుకునే సమయంలో ముఖంలోని 30కి పైగా కండరాలు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ముఖ కండరాలకు సహజమైన వ్యాయామం లభించి, రక్తప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ముఖ చర్మం తాజాగా కనిపించడానికీ పరోక్షంగా సహాయపడుతుంది.
5.రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం
పరస్పర ప్రేమాభిమానాలతో ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని సూక్ష్మజీవుల పరిచయం ద్వారా రోగనిరోధక వ్యవస్థ స్పందించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ జలుబు, ఫ్లూ, నోటి ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అంటువ్యాధులు ఉన్నప్పుడు ముద్దు ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
