Pakistan: సెప్టెంబర్ 22న తెల్లవారుజామున పాకిస్తాన్‌లోని కైబర్ ఫఖ్తూన్ రాష్ట్రంలోని మాత్రేధరా అనే చిన్న గ్రామంపై జరిగిన వైమానిక దాడి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ నిత్రపోతున్న సమయంలో యుద్ధ విమానాలు బాంబులు జారిడిచాయి. దీంతో ఇళ్లు, స్కూల్, మసీదులు అన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో నిద్రలోనే చాలా మంది శాశ్వత నిద్రలోకి వెళ్లారు. శిథిలాల కింద వందల మంది ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం జేఎఫ్–17 బాంబర్స్ ద్వారా వేసిన ఎనిమిది ఎల్‌ఎస్–6 బాంబులు గుడిసెలు, ఇళ్లు, స్కూళ్లను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో అనేక మంది సామాన్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. యుద్ధ నియమాన్ని ఉల్లంఘిస్తూ, పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
దాడికి కారణం ఇదే..
పాకిస్తాన్ సైన్యం ఈ దాడిని గ్రామ ప్రజలకు గుణపాఠం చెప్పే ఉద్దేశంతో చేసినట్లు తెలుస్తోంది. కైబర్ ఫఖ్తూన్ రాష్ట్రంలో పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తున్న తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) సమస్యను అణచివేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, టీటీపీ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు తెలిసినప్పటికీ, వారిపై దాడి చేయకుండా సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఆశ్చర్యకరం. ఈ దాడి వెనుక ప్రభుత్వం, సైన్యం భయాన్ని సృష్టించి, ప్రజలను అణచివేయాలనే ఉద్దేశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సైన్యం, ప్రభుత్వం మధ్య విశ్వాస సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది.
యుద్ధ నియమం ఉల్లంఘన..
సామాన్యులపై దాడి చేయకూడదన్న యుద్ధ నీతిని పాకిస్తాన్ సైన్యం బహిరంగంగా ఉల్లంఘించింది. ఎల్‌ఎస్–6 బాంబులు అత్యంత శక్తివంతమైనవి మరియు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఈ బాంబులను ఉపయోగించి ఒక చిన్న గ్రామాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ఆ గ్రామాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ చర్య సైన్యం యొక్క బాధ్యతారాహిత్యాన్ని, ప్రజల ప్రాణాలపై లెక్కలేనితనానిన సూచిస్తుంది. ఇది అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.
బలూచిస్తాన్ తరహా సంక్షోభం?
సొంత ప్రజలపై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం వాటి గొయ్యి అవే తవ్వుకుంటున్నాయి. ఇలాగే కొనసాగితే ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. బలూచిస్తాన్‌లో ఇప్పటికే వేర్పాటు ఉద్యమాలు బలంగా ఉన్నాయి, ఇప్పుడు కైబర్ ఫఖ్తూన్‌లో ఇలాంటి దాడులు జరగడం వల్ల ఈ రాష్ట్రంలో కూడా వేర్పాటు భావనలు బలపడే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో కూడా అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి చర్యలు దేశంలో రాజకీయ మరియు సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. ప్రజల్లో పాలకులు, సైన్యంపై వ్యతిరేకత పెరిగి, దేశ స్వరూపమే మారిపోయే ప్రమాదం ఉంది.
టీటీపీతో పోరాడలేక..
తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)తో పోరాడాల్సిన అవసరం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ సైన్యం దానిని విస్మరించి సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం. టీటీపీ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండి దాడులు చేస్తున్నప్పటికీ, వారిని ఎదుర్కోవడానికి సైన్యం వ్యూహాత్మక చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నలను లేవనెత్తుతోంది. బదులుగా, సామాన్య ప్రజలపై దాడి చేయడం ద్వారా సైన్యం తన బలహీనతను బహిర్గతం చేస్తోంది. ఇది టీటీపీ ఉగ్రవాదులకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది.