Kuwait Shiva : నిరుపేద కుటుంబం. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు 5 లక్షల రూపాయలు అప్పు చేశారు.దానిని ఎలా తీర్చాలో తెలియక ఉపాధి బాట పట్టాడు ఆ ఇంటి యజమాని. విదేశాలకు వెళ్తే స్వల్పకాలంలోనే అప్పులు తీర్చవచ్చని.. ఇద్దరి కుమార్తెలకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చని కలలు కన్నాడు. కానీ ఆ కలలను చిదిమేశాడు ఆ ఏజెంట్. రంగుల కలను చూపించి.. నడి ఎడారిలో విడిచి పెట్టాడు. ఆ కుటుంబాన్ని నట్టేట ముంచాడు. కువైట్లో చిక్కుకొని అష్ట కష్టాలు పడిన శివ వ్యధ ఇది.ఆయన కుటుంబాన్ని పలకరిస్తే కన్నీరు ఆపుకోలేం. వారి కష్టాలను జీర్ణించుకోలేం..
కువైట్ లో అష్ట కష్టాలు పడుతూ సోషల్ మీడియా ద్వారా సాయాన్ని అర్ధించిన శివ వివరాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీ ఆయన స్వగ్రామం. చిత్తూరు జిల్లా కల్లూరు కు చెందిన శివ 18 సంవత్సరాల కిందట చింతపర్తికి వచ్చి శంకరమ్మ ను పెళ్లి చేసుకున్నాడు. అక్కడే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. శివ భార్య శంకరమ్మ, పెద్ద కుమార్తె ప్రతిరోజు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళుతుంటారు. కూలి చేస్తే కానీ పూట గడవని పరిస్థితి వారిది. ఇలాంటి నేపథ్యంలో కుమార్తెలను చదివించడానికి, పెళ్లి చేసేందుకు రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా ఇటీవల శివ కువైట్ వెళ్ళాడు.అక్కడ చెప్పిన పని కాకుండా ఎడారిలో జంతువుల పెంపకం బాధ్యతలను అప్పగించారు. అప్పటినుంచి మనో వ్యధకు గురైన శివ తనను కాపాడాలంటూ సోషల్ మీడియాలో కోరడం, ఏపీ మంత్రి లోకేష్ వరకు ఆ విషయం వెళ్లడంతో ఎట్టకేలకు విముక్తి లభించింది.
అయితే గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శివ చిన్న కుమార్తె తండ్రిని తలుచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబం ఏ స్థితిలో ఉందో వివరించే ప్రయత్నం చేశారు.తమను పెంచి, చదివించేందుకు తమ తండ్రి పడిన బాధను వివరిస్తూ ఇద్దరు పిల్లలు రోదించారు. వారి పరిస్థితిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.రాయలసీమలో విదేశీ ఉద్యోగాల పేరిట జరుగుతున్న దందాను ఈ ఘటన బయటపెట్టింది.
ఇంటి అవసరాల కోసం చేసే అప్పు, పిల్లల చదువులు, వారికి పెళ్లిళ్లు.. వీటిపై ఆలోచన చేసి తన భర్త శివ విదేశాలకు వెళ్ళాడని.. కానీ ఏజెంట్ మోసం చేశాడని భార్య శంకరమ్మ కన్నీరు మున్నీరయింది. కువైట్ నుంచి తిరిగి రప్పించాలంటే విమాన ఖర్చులకు 30000 రూపాయలు చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేసినట్లు చెబుతోంది. ఇప్పటికే ఐదు లక్షల రూపాయలు అప్పులు చేసిన తనకు.. ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టలేదని.. అందుకే చెల్లించలేదని తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచింది. ఎంత కష్టమైనా భరించాలని తన భర్తకు సూచించినట్లు చెప్పుకొచ్చింది.అటు శివ సైతం సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు తన భార్యను కూడా తప్పుపట్టారు. అయితే గ్రామంలో కుటుంబ పరిస్థితి తెలిశాక.. ఏ స్థితిలో భార్య వారించి ఉంటుందో తెలుస్తోంది.కేవలం కుటుంబ అవసరాలను దాటించుకునేందుకు, కష్టాలను గట్టెక్కించేందుకు.. ఎంత కష్టమైనా ఓర్చుకోవాలని సూచించినట్లు భార్య చెబుతోంది.అయితే తన తండ్రి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటూ ఆ పిల్లలిద్దరూ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. వారి కళ్ళల్లో ఆ ఆర్ద్రత కనిపిస్తోంది. తండ్రి ఎంత కష్టంలో చిక్కుకున్నాడో తెలియజేస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What is the life story of shiva why he trapped in kuwait
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com