Neighboring countries : నలుదిక్కులా సంక్షోభం.. పూడ్చలేని అస్థిరత.. ఇంతకీ మన పొరుగు దేశాలకు ఏమైంది..

పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలలో రాజకీయ సంక్షోభాలు నెలకొన్నాయి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ అంశాలు భారతదేశాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి మన దేశ విదేశాంగ విధానానికి సవాల్ విసురుతున్నాయి. ఆర్థికపరంగా నష్టాన్ని కూడా కలగజేస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : August 7, 2024 8:18 pm
Follow us on

Neighboring countries : ఒకచోట ఆహార కొరత.. మరోచోట రాజకీయ స్థిరత.. ఇంకోచోట ఆర్థిక సంక్షోభం.. ఇలా నలు దిక్కులా ఏదో ఒక సంక్షోభం.. శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అశాంతి అంతకంతకు పెరుగుతోంది. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. జనాగ్రహానికి భయపడి పాలకులు దేశం వదిలి పారిపోతున్నారు. ఇలా ఒక్క దేశంలో కాదు.. మన చుట్టూ ఉన్న దేశాలలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం శ్రీలంకలో అక్కడి అధ్యక్షుడు మహీందా రాజపక్సే కుటుంబంతో సహా పారిపోతే ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. సరిగ్గా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మగ్గుతున్నాడు. మనకు పొరుగున ఉన్న మయన్మార్ నిత్యం ఏదో ఒక వివాదంతో రగులుతూనే ఉంది.

పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలలో రాజకీయ సంక్షోభాలు నెలకొన్నాయి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ అంశాలు భారతదేశాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇవి మన దేశ విదేశాంగ విధానానికి సవాల్ విసురుతున్నాయి. ఆర్థికపరంగా నష్టాన్ని కూడా కలగజేస్తున్నాయి. ఈ క్రమంలో ఉపఖండంలో శాంతిని పరిఢవిల్లేలా చేసి.. సుస్థిరతకు కృషి చేయాల్సిన అవసరం భారత్ పై ఉందని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గత 15 సంవత్సరాల లో సరికొత్త మలుపు తీసుకుంది. విస్తారంగా నీరు, మానవ వనరులు ఉండడంతో అనేక బహుళ జాతి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో 1994 -2023 మధ్యకాలంలో బంగ్లాదేశ్ 5.8 గ్రోత్ రేట్ నమోదు చేసింది. దేశం అభివృద్ధి వైపు సాగిపోతుండగా.. మతోన్మాదం, అరాచకత్వం గాయాల లాగా సలపడం మొదలుపెట్టాయి. జమాతే ఇస్లామి వంటి అతివాద సంస్థలు ఇక్కడి ప్రభుత్వాన్ని నిలువునా కూల్చివేయడంలో సఫలీకృతమయ్యాయి.

శ్రీలంక

కరోనా తర్వాత శ్రీలంక సర్వనాశనమైంది. సరుకుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో, జిడిపి దారుణంగా పతనమైంది. ఫలితంగా ఆ దేశం అంధ పాతాళానికి పడిపోయింది. ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరడంతో రాజపక్స ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది. అంతేకాదు ప్రజల నుంచి తిరుగుబాటు అధికం కావడంతో ఆయన ట్రింకో మలై నౌకాశ్రయానికి వెళ్ళిపోయి బతుకు జీవుడా అనుకుంటూ రహస్యంగా జీవితం గడిపారు.

పాకిస్తాన్

పాకిస్తాన్ నిత్యం ఏదో ఒక వివాదంతో రగిలిపోతూనే ఉంటుంది.. 2022లో ఏప్రిల్ నెలలో ఆ దేశ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పదవి నుంచి తొలగి పోవాల్సి వచ్చింది. అప్పటినుంచి పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లో కోలుకోలేని స్థితికి పడిపోయింది. ఇక ప్రస్తుతం పరిపాలిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తిరుగుబాటుదారులు ఆందోళనలు చేపడుతున్నారు. కాల్పులు, హత్యలు అక్కడ నిత్యకృతంగా మారాయి.

ఆఫ్ఘనిస్తాన్

ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోయింది. దేశం మొత్తం పేదరికం విలయతాండవం చేస్తోంది. అమెరికా దళాలు 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో.. తాలిబన్లు తిరిగి అధికారాన్ని చేపట్టారు. అంతేకాదు ఆ దేశ పౌరులకు విద్య, పౌర ఇతర హక్కులను కాల రాశారు. ఇస్లామిక్ చట్టాలను అత్యంత దారుణంగా అమలు చేస్తున్నారు. విధంగా అక్కడి ప్రజలు తీవ్రమైన ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. వైద్య సదుపాయాల లేమితో నరకం చూస్తున్నారు.

మయన్మార్

అత్యంత కల్లోల దేశంగా మయన్మార్ పై ముద్ర పడింది. అక్కడ అధికారంలో సైనిక పాలకులు ఉన్నారు. వీరిని జుంటా అని పిలుస్తారు. మయన్మార్ పౌరులను లక్ష్యంగా చేసుకొని సైనిక పాలకులు దాడులకు పాల్పడుతున్నారు. మరోవైపు తిరుగుబాటుదారులు వైమానిక దాడులు చేస్తున్నారు. దీంతో అంతర్యుద్ధం తారా స్థాయికి చేరింది. అక్కడి పౌరులు శరణార్థులుగా మనదేశంలోని మిజోరాం, మణిపూర్ ప్రాంతాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మిజోరం, మణిపూర్ ప్రాంతాలలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రత దళాలు పహరాను అత్యంత కట్టుదిట్టం చేశాయి.