Vladimir Putin And Modi: రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో భారతీయులు మాస్కో సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. అయితే, వారందరినీ వదిలిపెట్టేందకు రష్యా తాజాగా అంగీకరించింది. ఇరు దేశాల అధినేతలు మోదీ, పుతిన్ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రష్యాలో పర్యటిస్తున్న మోదీ..
ఇదిలా ఉంటే.. దాదాపు ఐదేళ్ల తర్వాత మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకు వెళ్లారు. మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ గౌరవర్థాం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం(జూలై 8)రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేటు డిన్నర్‌లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావనకు తెచ్చారు. భారతీయులను విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఇందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలిసింది. భారతీయులను విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఉద్యోగాలు ఆశచూపి..
భారతీయులకు ఉద్యోగాలు, ఉపాధి ఆశలు చూపి కొంతమంది మోసపూరితంగా రష్యాకు తరలించారు. అక్కడ ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారు. దీనిపై గతంలో అనేక కథనాలు వచ్చాయి. నలుగురు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూ మరణించినట్లు సమాచారం. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందంచింది. మాస్కో అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలోనే కొంత మందిని సురక్షితంగా భారత్‌కు పంపించారు. మరో 30 నుంచి 40 మంది భారత యువకులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటున్నట్లు సమాచారం.
యుద్ధంపై మోదీ సూచన..
ఇదిలా ఉంటే.. ప్రైవేటు డిన్నర్‌లో ఇరు దేశాల అధినేతలు ఉక్రెయిన్‌తో యుద్ధంతోపాటు పలు అంశాలపై చర్చించారు. దేశాల ప్రాదేశికత, సార్వభౌమత్వాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తుందని, యుద్ధభూమిలో దేనికీ పరిష్కారాలు లభించవని మోదీ పుతిన్‌కు సూచించినట్లు సమాచారం. 2022లో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో షాంఘై సదస్సు సమయంలో ఈ దేశాధినేతలు ముఖాముఖి కలిశారు. ఇది యుద్ధాల శకం కాదని ప్రధాని సూచించారు.
మోదీపై ప్రశంసలు..
మరోవైపు భారత్‌లో మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. ఇది యాదృచ్ఛికంగా సాధించిన విజయం కాదని, ఎన్నో ఏళ్లుగా చేసిన కృషి, శ్రమకు దక్కిన ఫలితమని పేర్కొన్నారు. ‘మీకు సొంత ఆలోచనలు ఉన్నాయని, మీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తి. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం లక్ష్యాలను సాధించగల దిట్ట’ అని పుతిన్ కొనియాడారు.