Usha Chilukuri : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి మూలాలు కృష్ణాజిల్లాలో.. ఆమె పూర్వికులు ఏం చేసేవారంటే..

ఉషకు కృష్ణా జిల్లాతోను సంబంధం ఉంది. ఆమె తండ్రి మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురంలో ఉన్నాయి. ఉషకు తాత అయ్యే చిలుకూరి రామ్మోహన్రావు ప్రస్తుతం తన కుటుంబంతో ఇక్కడే ఉంటున్నారు. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి సంవత్సరాల క్రితమే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సాయి పురం లో 18 వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చి పాపయ్య శాస్త్రి ఉండేవారు. ఆయన సంతానమే విస్తరించి..

Written By: Bhaskar, Updated On : July 18, 2024 12:48 pm
Follow us on

Usha Chilukuri : అమెరికా లో వచ్చే నవంబర్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో ఉన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంపిక చేశారు. వాన్స్ ఎంపిక నేపథ్యంలో ఆయన భార్య ఉషా చిలుకూరి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయ్యారు. గతంలో వాన్స్ సేనేటర్ గా గెలుపొందడంలో ఉషా కీలకపాత్ర పోషించారు. వాన్స్ – ఉషది ప్రేమ వివాహం. 2010లో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. నాలుగు సంవత్సరాల డేటింగ్ తర్వాత.. 2014లో వారు వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు..వాన్స్ ను ఉపాధ్యక్ష పదవి కి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి ఉష గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఉష తన తల్లిదండ్రులతో చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయింది. అక్కడే విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ఆ దేశాన్ని చెందిన వ్యక్తితో ప్రేమలో పడి, అతడినే వివాహం చేసుకుంది. దీంతో ఆమె అమెరికా పౌరురాలు అయిపోయింది.

విశాఖపట్నం తో సంబంధం

ఉష చిన్నప్పుడే తన తల్లిదండ్రులతో అమెరికా వెళ్ళిపోయింది. ఆమెకు విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. నగరానికి చెందిన ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు. ప్రస్తుతం శాంతమ్మ 9 పదుల సంవత్సరాల వయసుకు చేరుకున్నారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయన విశాఖపట్నంలో తెలుగు ప్రొఫెసర్ గా పని చేశారు. వయోభారం వల్ల కొన్ని సంవత్సరాల క్రితం కన్నుమూశారు. సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ కూతురే ఉష. రాధాకృష్ణ కుమారుడు – కోడలు ఉద్యోగ నిమిత్తం చాలా సంవత్సరాల క్రితమే అమెరికా వెళ్ళిపోయారు. అప్పటికే ఉష జన్మించడంతో.. ఆమెను కూడా తీసుకొని వెళ్లారు. ఉష ప్రాథమిక, మాధ్యమ, ఉన్నత విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది. ప్రఖ్యాత యెల్స్ విశ్వవిద్యాలయంలో లా విద్యను అభ్యసించింది.. ఆ సమయంలోనే ఆమెకు వాన్స్ పరిచయమయ్యాడు. అది కాస్త స్నేహానికి దారితీసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా నాలుగు సంవత్సరాల పాటు వారిద్దరూ డేటింగ్ చేశారు. డేటింగ్ అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగింది. ఉష – వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు. వాన్స్ వ్యాపారవేత్తగా, సేనేటర్ గా రాణించడం వెనుక ఉష పాత్ర కీలకం. సేనెటర్ గా వాన్స్ పోటీ చేసినప్పుడు ఉష తన వంతు పాత్ర పోషించింది. అక్కడి ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయవంతం అయింది.

ఇక్కడితో పరిచయం తక్కువే

ఉష భర్త జెడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక కావడంతో.. ప్రభుత్వ శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు. “ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె కూడా అక్కడి జాతీయురాలు అయిపోయింది. దీంతో మాతో ఆమెకు పరిచయం తక్కువే. వాన్స్ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిసిన తర్వాత.. చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫోన్లోనే నాకు శుభాకాంక్షలు తెలిపారు. చెన్నైలో ఉష మేనత్త ఉంటుంది. ఆమె అక్కడ వైద్యురాలిగా స్థిరపడింది. వాన్స్ – ఉష వివాహానికి ఆమె హాజరైంది. ఇక మా బంధువులు కూడా అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష భర్త ఆ స్థాయికి చేరుకొనడం తెలియగానే వారు సంతోషపడ్డారు. గర్వాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా వాన్స్ గెలుస్తారు. నా ఆశీస్సులు ఆమెకు ఎప్పుడూ ఉంటాయి” అని శాంతమ్మ పేర్కొన్నారు.

ఇక్కడికి ఆహ్వానిస్తాం

ఉష దంపతులు భారతదేశంలో ఉండి, అమెరికాలో ఉన్నత స్థాయికి వెళ్తే మరింత ఆనందంగా ఉండదని శాంతమ్మ అన్నారు. “వాన్స్ కచ్చితంగా గెలుస్తారు. ఆ ఎన్నికల్లో గెలిచి మన దేశానికి సహకారాన్ని అందించాలి. భరోసాగా నిలవాలి. ఎన్నికల్లో గెలిచిన అనంతరం వారిద్దరినీ విశాఖ నగరానికి ఆహ్వానిస్తాం. గత కొద్దిరోజులుగా మతమార్పిడులు ఎక్కువయ్యాయి. హిందువులను కాపాడేందుకు, హిందూ ధర్మాన్ని రక్షించేందుకు కృషి చేయాలని ఉషను కోరతానని” శాంతమ్మ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం శాంతమ్మకు 96 సంవత్సరాలు. గత ఏడాది వరకు విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పాటలు బోధించేందుకు ఆమె వెళ్లేవారు. ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థులకు గైడ్ ప్రొఫెసర్ గా పనిచేయాలని ఉందని శాంతమ్మ చెబుతున్నారు.

కృష్ణాజిల్లా తోనూ సంబంధం ఉంది

ఉషకు కృష్ణా జిల్లాతోను సంబంధం ఉంది. ఆమె తండ్రి మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురంలో ఉన్నాయి. ఉషకు తాత అయ్యే చిలుకూరి రామ్మోహన్రావు ప్రస్తుతం తన కుటుంబంతో ఇక్కడే ఉంటున్నారు. ఉష పూర్వీకులు కృష్ణా జిల్లా నుంచి సంవత్సరాల క్రితమే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సాయి పురం లో 18 వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చి పాపయ్య శాస్త్రి ఉండేవారు. ఆయన సంతానమే విస్తరించి.. ఉష వరకు చేరింది. ఉష ముత్తాత పేరు వీరావధాన్లు. ఆయనకు రామశాస్త్రి, సూర్య నారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాల కృష్ణమూర్తి అనే ఐదుగురు కొడుకులు ఉండేవారు. వారంతా కూడా ఉన్నత చదువులు చదివిన వారే.

ఐదుగురు కొడుకుల్లో రామశాస్త్రి అప్పట్లోనే మద్రాస్ వెళ్ళిపోయారు. ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్ గా పని చేశారు. ఆయన భార్య పేరు బాలా త్రిపుర సుందరి. వీరికి అవధాని, నారాయణ శాస్త్రి, రాధాకృష్ణ అనే ముగ్గురు కుమారులు, కుమార్తె శారద సంతానం. ముగ్గురు కుమారులు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. శారద ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు.

రాధాకృష్ణ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం శాండియాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన పామర్రుకు చెందిన లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి సంతానమే ఉష. “ఉష తాత రామశాస్త్రి చిన్న సోదరుడు గోపాలకృష్ణమూర్తి, నాకు తోడల్లుడు అవుతాడు. ఓకే ఇంటి ఆడపడుచులను వివాహాలు చేసుకున్నాం. ఉష భర్త అమెరికా ఉపాధ్యక్ష ఎన్నిక బరిలో ఉండడం ఆనందాన్ని కలిగిస్తోందని” రామ్మోహన్ రావు తెలిపారు.

గెలవడం పక్కా

అమెరికాలో నవంబర్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల హత్యాయత్నానికి గురైన ట్రంప్ గెలవడం ఖాయమని వివిధ సర్వే సంస్థలు చెబుతున్నాయి. గత శనివారం పెన్సిల్వేనియాలో బట్లర్ ప్రాంతంలో ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఓ దుండగుడు తుపాకీతో కాల్చాడు. ఆ తుపాకి బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకితే వెళ్ళింది. తీవ్రంగా గాయం కావడంతో రక్తస్రావం కూడా అధికంగా అయింది. ఫలితంగా ట్రంప్ ను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి అమెరికా వ్యాప్తంగా ట్రంప్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని అక్కడి సర్వే సంస్థలు చెబుతున్నాయి. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించబోతారని వివరిస్తున్నాయి..