https://oktelugu.com/

Karnataka: కర్ణాటకలో స్థానికులకే 100 శాతం ఉద్యోగాలు.. తీవ్ర వ్యతిరేకత.. బిల్లుపై సిద్ధరామయ్య వెనుకడుగు.. అసలేంటి వివాదమంటే?

ప్రైవేట్‌ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలని సిద్ధరామయ్య సర్కార్‌ నిర్ణయించింది. దీనికి క్యాబినెట్‌ కూడా ఓకే చెప్పింది. అయితే ఈ నిర్ణయంపై పారిశ్రామికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లు అమలయేతే కర్ణాటక నుంచి వెళ్లిపోతామని తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్‌ బిల్లును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 18, 2024 12:58 pm

    Karnataka

    Follow us on

    Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏడాది పాలనపై అన్నివర్గాల్లో వ్యతిరేకత పెరిగింది. ఇప్పటికే ఉచిత పథకాలు అమలు చేస్తూ మరోవైపు పన్నుల భారం మోపడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ చార్జీలు పెంచాలని సంస్థ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పెంపు 15 నుంచి 20 శాతం ఉండాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ప్రభ్వుంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్‌ బిల్లు తెచ్చింది సిద్ధరామయ్య సర్కార్‌. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. బిల్లును పునఃసమీక్షించి భవిష్యత్‌ కార్యాచరణను రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా తెలిపారు. ప్రైవేట్‌ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదించిన బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి ఎక్స్‌లో ప్రకటన విడుదల చేశారు.

    పారిశ్రామిక వర్గాల నుంచి వ్యతిరేకత..
    ప్రైవేట్‌ రంగ సంస్థలు, పరిశ్రమలు, సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించాలని సిద్ధరామయ్య సర్కార్‌ నిర్ణయించింది. దీనికి క్యాబినెట్‌ కూడా ఓకే చెప్పింది. అయితే ఈ నిర్ణయంపై పారిశ్రామికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ బిల్లు అమలయేతే కర్ణాటక నుంచి వెళ్లిపోతామని తెలిపాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద ఉద్యోగ రిజర్వేషన్‌ బిల్లును ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లును పునఃసమీక్షించి భవిష్యత్‌ కార్యాచరణను రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

    స్థానికుల ఉపాధి కోసం..
    పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానికులకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో కర్ణాటక రాష్ట్ర ఉపాధి బిల్లు, 2024 సోమవారం జరిగిన క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏదైనా పరిశ్రమలు, ఫ్యాక్టరీ లేదా ఇతర సంస్థలు స్థానిక అభ్యర్థుల్లో 50 శాతం మందిని మేనేజ్‌మెంట్‌ కేటగిరీల్లో, 70 శాతం మందిని నాన్‌ మేనేజ్‌మెంట్‌ కేటగిరీల్లో నియమించాలని పేర్కొంది. అభ్యర్థులకు కన్నడ భాషగా సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్లు లేకుంటే, వారు కన్నడ ప్రావీణ్య పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని బిల్లులో నిర్దేశించారు.

    బిల్లుపై విమర్శలు..
    ఈ బిల్లును అమలు చేస్తే బెంగళూరు నైపుణ్యం కలిగిన ప్రతిభను కోల్పోతుందని పారిశ్రామిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కన్నడ–తప్పనిసరి నిబంధన సరికాదని పేర్కొన్నారు. ఈ బిల్లు భారతీయ ఐటీ, జీసీసీ లను భయపెట్టడమే అని అసోచామ్‌ కో చైర్మన్‌ ఆర్కే మిశ్రా పేర్కొన్నారు.

    వివాదాస్పద బిల్లు ఏమిటి?
    ప్రైవేటు పరిశ్రమల్లో కన్నడిగులకు అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులకు 50 శాతం, నాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులకు 75 శాతం రిజర్వేషన్లు అమలు చేసే బిల్లు వివాదాస్పదమైంది. రాష్ట్రంలో కన్నడిగులకు ఉద్యోగావకాశాలు లేకుండా పోవాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని సిద్ధరామయ్య చెప్పడంతో కన్నడిగులకు ప్రాధాన్యత కల్పించే చర్యపై మొదట్లో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది. తమది కన్నడ అనుకూల ప్రభుత్వమని, కన్నడిగుల సంక్షేమమే మా ప్రాధాన్యత అని సిద్ధరామయ్య అన్నారు.

    స్పందించిన ఏపీ ప్రభుత్వం..
    కన్నడ ఉద్యోగాలకు అర్హత సాధిస్తే కర్ణాటకలో దుకాణాలు మూసేయాల్సి వస్తుందని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆంద్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. పారిశ్రామిక వేత్తలు ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘మీ నిరుత్సాహాన్ని మేము అర్థం చేసుకున్నాము. వైజాగ్‌లోని మా ఐటీ సేవలు, ఏఐ మరియు డేటా సెంటర్‌ క్లస్టర్‌కు మీ వ్యాపారాలను విస్తరించడానికి లేదా మార్చడానికి మేము మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. మేము మీకు ఉత్తమమైన–తరగతి సౌకర్యాలు, నిరంతరాయ విద్యుత్, మౌలిక సదుపాయాలు మరియు అత్యంత అనుకూలమైన నైపుణ్యాన్ని అందిస్తాము. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుండి ఎటువంటి ఆంక్షలు లేకుండా మీ ఐటీ సంస్థ కోసం ప్రతిభావంతులు మిమ్మల్ని సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నారు’ అని నారా లోకేష్‌ పోస్ట్‌ చేశారు. లోకేశ్‌ పోస్టుపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. ఆంధ్రా కంపెనీలకు ఆంధ్రులకు ఉపాధి కల్పించడం మంత్రికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. ‘పరిశ్రమ నాయకులు, సలహా సంస్థలు మరియు ముసాయిదా విధానాలు మరియు స్కీమ్‌లలో కన్సార్టియమ్‌లతో మా స్థిరమైన సంబంధాలు మరియు సంప్రదింపుల విధానం కారణంగా కర్నాటక ఎల్లప్పుడూ అత్యధిక రంగాలలో రాణిస్తోంది. మునుపటి కార్యక్రమాల మాదిరిగానే, ఈ ముసాయిదా బిల్లు మా పరిశ్రమ భాగస్వాముల నుండి సిఫార్సులను కలిగి ఉంటుంది‘ అని లోకేశ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ‘మా లక్ష్యం స్థానిక ప్రతిభను ఉపయోగించి ప్రపంచ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం, అదే సమయంలో ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం.‘
    ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టిన ప్రతి కంపెనీ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అర్హులైన, శిక్షణ పొందిన మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉపాధి కల్పించేలా చూడాలని మీరు కోరుకుంటున్నారా? ప్రియమైన నాస్కామ్‌ నిశ్చయంగా ఉండండి, చట్టపరమైన పరిశీలనను తట్టుకోలేని ఏదీ మేము చేయం. ఇది మీ ప్రభుత్వం మరియు మేము ఎప్పటిలాగే కాల్‌ దూరంలో ఉన్నాము’ఖర్గే నాస్కామ్‌కు హామీ ఇచ్చారు.

    గతంలో హరియాణాలో..
    ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నివాసితులకు ప్రైవేట్‌ రంగ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేస్తూ గతంలో హరియాణా ప్రభæుత్వం ప్రవేశపెట్టిన బిల్లు మాదిరిగానే కర్ణాటక చర్య కూడా ఉంది. అయితే హరియాణా తెచ్చిన బిల్లును పంజాబ్, హర్యాణా హైకోర్టు 2023, నవంబర్‌ 17 కొట్టివేసింది. ఇప్పుడు కర్ణాటక బిల్లు కూడా ఇదే పరిస్థితి రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.