Homeఅంతర్జాతీయంUS Warning To China: చైనాకు అమెరికా వార్నింగ్‌.. మధ్యప్రాచ్య యుద్ధంలో కొత్త మలుపు!

US Warning To China: చైనాకు అమెరికా వార్నింగ్‌.. మధ్యప్రాచ్య యుద్ధంలో కొత్త మలుపు!

US Warning To China: ఇటీవలే పశ్చిమాసియా యుద్ధానికి రెండు వారాల బ్రేక్‌ పడింది. మరోవైపు ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా– ఇరాన్‌ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. చైనా ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ, చైనా ఇటువంటి చర్యలు కొనసాగిస్తే ‘తీవ్ర పరిణామాలు‘ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా నౌకాదళం సీమైన్స్‌ తొలగింపులో నిమగ్నమై ఉందని, ఇరాన్‌ సైనికపరంగా ఓడిపోయినా చర్చలు మాత్రం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

రహస్యంగా ఆయుధాల సరఫరా..
అమెరికా నిఘా వర్గాలు గుర్తించిన వివరాల ప్రకారం, చైనా ఇరాన్‌కు భారీ ఎత్తున ఆయుధాలు పంపిస్తోంది. భుజం మీద నుంచి ప్రయోగించే షార్ట్‌రేంజ్‌ మిసైల్‌ లాంచర్లు, ఆధునిక క్షిపణి వ్యవస్థలు, విమానాలు, డ్రోన్లను కూల్చే వ్యవస్థలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించింది. ఈ ఆయుధాలు మూడు నాలుగు బోయింగ్‌ 747 సరకు విమానాల్లో చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరి, ఇతర దేశాల మీదుగా రహస్య మార్గాల్లో టెహ్రాన్‌కు చేరుతున్నాయని వెల్లడించింది. వారం రోజుల్లో ఇవి ఇరాన్‌కు చేరే అవకాశం ఉంది. చైనా తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు ఈ పరోక్ష మార్గాలను ఎంచుకుంటోందని పేర్కొంది. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ తాము అమెరికా విమానాలను విజయవంతంగా కూల్చడానికి ‘ఆధునిక రక్షణ వ్యవస్థలే‘ కారణమని పేర్కొంది. అవి చైనా నుంచి వచ్చినవేనని అమెరికా నిఘా వర్గాలు నమ్ముతున్నాయి.

ట్రంప్‌ హెచ్చరిక..
ఈ ఆరోపణలపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. చైనా ఇరాన్‌కు ఆయుధాలు పంపడం మానుకోవాలని, లేకపోతే బీజింగ్‌కు ‘వినాశకర పరిణామాలు‘ తప్పవని హెచ్చరించారు. అమెరికాతో వాణిజ్య యుద్ధంలో చైనాకు 200% టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని గతంలోనే ప్రకటించిన ట్రంప్, ఈసారి మరింత కఠినంగా మాట్లాడారు. ‘మాకు నాటో నుంచి ఎటువంటి సాయం లభించలేదు. అయినా ఇరాన్‌ను సైనికపరంగా ఓడించాం. చర్చలు విఫలమైనా అంతిమ విజయం మాదే,‘ అని ట్రంప్‌ పేర్కొన్నారు. హర్మూజ్‌ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవకపోతే, ఇరాన్‌ విద్యుత్‌ కేంద్రాలను ‘తుడిచిపెట్టేస్తామని‘ ఆయన బహిరంగంగా హెచ్చరించారు.

ఖండించిన చైనా…
వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయలేదని పేర్కొంది. అయితే, ఇరాన్‌ అధికారికంగా చైనా ఆయుధాలు అందినట్లు వెల్లడించకపోయినా, తమ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థల సామర్థ్యాన్ని బట్టి చూస్తే చైనా సాయం స్పష్టంగా కనిపిస్తోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాకు ఇరాన్‌ నుంచి రోజుకు 20 లక్షల బ్యారెళ్ల ముడిచమురు సరఫరా అవుతోంది. ఈ ఆర్థిక బంధమే చైనా ఇరాన్‌కు రహస్య సాయం చేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మధ్య ప్రాచ్యంలో కీలక పరిణామాలు
ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తున్నాయి. చైనా–ఇరాన్‌ బంధం మరింత బలపడటం, ఆర్థిక, సైనిక సహకారం పెరగడం వల్ల అమెరికాకు ఇది సవాల్‌గా మారింది. నాటో దేశాలు ఈ యుద్ధంలో అమెరికాకు సాయం చేయకపోవడంతో అగ్రరాజ్యం ఒంటరిగా మారింది. హర్మూజ్‌ గుండా చమురు రవాణా ఆలస్యం కావడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది.

చైనా ఆయుధ సరఫరా ఇరాన్‌కు ఊపిరి పోసింది. అమెరికా సైనికపరంగా విజయం సాధించినా, చర్చలు విఫలమవడం మరియు చైనా రహస్య సాయం యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేశాయి. ట్రంప్‌ హెచ్చరికలను చైనా లెక్కచేయకపోతే, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదరే ప్రమాదం ఉంది. హర్మూజ్‌ జలసంధి తెరవడం, ఇరాన్‌తో చర్చలు విజయవంతం కావడంపై మధ్యప్రాచ్య భవిష్యత్‌ ఆధారపడి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular