US visa rules : అమెరికాలో హెచ్1బీ (H1B) వీసా కాలపరిమితి తగ్గింపు, ఓపీటీ (OPT) రద్దు వంటి ప్రతిపాదనల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణుల్లో నెలకొన్న ఆందోళనలపై టీవీ5 నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘భారతీయుల భవిష్యత్తుకు ట్రంప్ శాపం’ అనే అంశంపై యాంకర్ మూర్తి నిర్వహించిన ఈ డిబేట్‌లో తానా (TANA) ఎన్నారై స్టూడెంట్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు.
హెచ్1బీ ‘అబ్యూస్ యాక్ట్ 2026’.. వాస్తవమెంత?
ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి ఎలాట్ మెన్ ప్రవేశపెట్టిన ‘హెచ్1బీ వీసా అబ్యూస్ యాక్ట్ 2026’ బిల్లుపై డా. ఉమా గారు స్పందిస్తూ.. “ఈ బిల్లులో హెచ్1బీ వీసాను 3 ఏళ్లు మారిటోరియం పెట్టాలని.. కేవలం హెచ్1బీ 3 ఏళ్లకే పరిమితం చేయాలని.. వేతన పరిమితిని $200k వరకు పెంచాలని ప్రతిపాదించిన మాట వాస్తవమే. ఇది అమలులోకి వస్తే ఎంఎస్ పూర్తి చేసి ఓపీటీ ద్వారా ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే భారతీయ విద్యార్థులకు కచ్చితంగా సవాలుగా మారుతుంది. అయితే బిల్లు ప్రపోజ్ చేసినంత మాత్రాన అది చట్టం అయిపోదు” అని ఆమె స్పష్టం చేశారు.

చట్టం కావడం అంత సులువు కాదు
అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో మార్పులు రావడం అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని డా. ఉమా గారు పేర్కొన్నారు. ఒక బిల్లు చట్టంగా మారాలంటే.. ముందుగా కాంగ్రెస్ ఆమోదం పొందాలి.అనంతరం సెనెట్‌లో 60 శాతం మెజార్టీతో పాస్ కావాలి. చివరగా అధ్యక్షుడి సంతకం కావాలి.
సెనెట్‌లో ఇటువంటి కఠినమైన బిల్లులు పాస్ కావడం అంత సులువు కాదని, దీనిపై విద్యార్థులు ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని డా. ఉమా గారు భరోసా ఇచ్చారు. హెచ్1బీ గడువును 3 ఏళ్లకు కుదిస్తే అది కేవలం ఉద్యోగులకే కాదు, అమెరికాలోని కంపెనీలకు కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆమె విశ్లేషించారు.
విద్యార్థులకు సూచనలు.. టాలెంట్ ఉంటేనే మనుగడ
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలని డా. ఉమా సూచించారు. “అమెరికా ఒక వలసవాద దేశం. ప్రపంచవ్యాప్త టాలెంట్‌ను గుర్తించడం వల్లే అది అగ్రరాజ్యంగా నిలిచింది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు రెండు విషయాలపై దృష్టి సారించాలి. నైపుణ్యాభివృద్ధి పెంచుకోవాలి. ప్రస్తుతం ఏఐ ప్రభావం వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్న మాట వాస్తవం. అందుకే విద్యార్థులు ‘ఎక్స్‌ట్రీమ్ టాలెంట్’తో తమ స్కిల్స్ పెంచుకోవాలి. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. అక్కడ పద్ధతులకు అలవాటు పడి చట్టబద్ధంగా నడుచుకోవాలి.“ అని డా.ఉమాగారు సూచించారు.
ప్రస్తుతానికి ఇవన్నీ ప్రపోజల్ స్థాయిలోనే ఉన్నాయని.. అవి చట్టరూపం దాల్చడం కష్టమేనని చెబుతూనే.. అగ్రరాజ్యంలో రాణించాలంటే భారతీయులు తమ మేధోశక్తిని, నైపుణ్యాన్ని నిరంతరం మెరుగుపరుచుకోవాలని డా. ఉమా గారు పిలుపునిచ్చారు.
పూర్తి వీడియోను కింద చూడొచ్చు..

